IPL 2024 : రెచ్చిపోయిన శాంసన్, ధ్రువ్.. లక్నోపై రాజస్థాన్ విజయం.. ప్లేఆఫ్స్‌కు అర్హత!

IPL 2024 : లక్నో సూపర్ జెయింట్‌పై 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించి ప్లేఆఫ్‌కు దాదాపు అర్హత సాధించింది. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 8 గెలిచి ప్లేఆఫ్స్‌ బెర్త్ ఖాయం చేసుకున్న మొదటి ఫ్రాంచైజీగా నిలిచింది.

IPL 2024 : రెచ్చిపోయిన శాంసన్, ధ్రువ్.. లక్నోపై రాజస్థాన్ విజయం.. ప్లేఆఫ్స్‌కు అర్హత!

IPL 2024 : Rajasthan Royals beat Lucknow Super Giants by 7 wickets

IPL 2024 : ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. ఈ సీజన్‌‌లో అధిక విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. లక్నో సొంత మైదానంలో శనివారం ఇక్కడ జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ 8వ విజయాన్ని కైవసం చేసుకుంది. లక్నో సూపర్ జెయింట్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి రాజస్థాన్ ప్లేఆఫ్స్‌కు దాదాపు చేరుకుంది. ఆడిన 9 మ్యాచ్‌లలో 8 విజయాలతో మరో మరో 2 పాయింట్లను కైవసం చేసుకుంది. తద్వారా 16 పాయింట్లు సాధించి రాజస్థాన్ ప్లేఆఫ్స్‌ బెర్త్ ఖాయం చేసుకున్న మొదటి ఫ్రాంచైజీగా అవతరించింది.

197 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (24), జోస్ బట్లర్ (34), రియాన్ పరాగ్ (14) వేగంగా నిష్క్రమించారు. అయితే, కెప్టెన్ సంజూ శాంసన్ (71 నాటౌట్; 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్), ధ్రువ్ జురెల్ (52 నాటౌట్; 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్)తో అర్ధశతకాలు బాది జట్టును విజయతీరాలకు చేర్చారు.

ఫలితంగా రాజస్థాన్ 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఇంకా 6 బంతులు మిగిలి ఉండగానే 199 పరుగులతో గెలిచింది. లక్నో బౌలర్లలో యశ్ ఠాకూర్, మార్కస్ స్టోయినీస్, అమిత్ మిశ్రా తలో వికెట్ తీసుకున్నారు. రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్ (71/33)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

రాహుల్, హుడా హాఫ్ సెంచరీలు :
అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) నిర్ణీత 20 ఓవర్లలో 196/5 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (76), దీపక్ హుడా (50) ఆతిథ్య బ్యాటింగ్ చార్టుల్లో అగ్రగామిగా నిలిచారు. మిగతా ఆటగాళ్లలో క్వింటన్ డికాక్ (8) పరుగులకే చేతులేత్తేయగా, నికోలస్ పూరన్ (11), ఆయుష్ బదోని (18), కృనాల్ పాండ్యా (15) రాణించారు. ఫలితంగా లక్నో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసి ప్రత్యర్థి జట్టు రాజస్థాన్‌కు 197 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్నో నిర్దేశించిన లక్ష్యాన్ని రాజస్థాన్ సునాయసంగా ఛేదించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

16 పాయింట్లతో రాజస్థాన్ అగ్రస్థానం.. 
ఫలితంగా, ఆర్ఆర్ పాయింట్ల పట్టికలో ఆడిన 9 మ్యాచ్‌ల్లో 8 గెలిచి 1 మాత్రమే ఓడి 16 పాయింట్లతో అగ్రస్థానంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇంకా 5 గేమ్‌లు మిగిలి ఉండగానే రాజస్థాన్ ప్లేఆఫ్‌లలోకి అడుగు పెట్టింది. ఒకవేళ, రాజస్థాన్ మిగిలిన 5 మ్యాచుల్లో ఓడినా కూడా ప్లేఆఫ్స్ చేరుకోగలదు. లక్నో జట్టు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 4 ఓడి 10 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా, ట్రెంట్ బోల్ట్, అవేష్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీసుకున్నారు.

Read Also : IPL 2024: ముంబైపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయ దుందుభి