Priyansh arya: ఓర్నాయనో.. ఇదేం కొట్టుడు బాసు.. ప్రియాంశ్ ఆర్య బాదుడుకు ఐపీఎల్ లో ఆరు రికార్డులు.. అవేమిటంటే?
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై పంజాబ్ బ్యాటర్ ప్రియాంశ్ ఆర్య మెరుపు సెంచరీ చేశాడు. దీంతో ఐపీఎల్ లో ఆరు రికార్డులను నమోదు చేశాడు.

Priyansh Arya (Credit BCCI)
Priyansh arya: ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా మంగళవారం రాత్రి మొహాలీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు చెన్నై జట్టు ఐదు మ్యాచ్ లు ఆడగా.. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. అయితే, ఈ మ్యాచ్ లో పంజాబ్ బ్యాటర్ ప్రియాంశ్ ఆర్య మెరుపు సెంచరీ చేశాడు. దీంతో ఆరు రికార్డులను నమోదు చేశాడు.
Also Read: IPL 2025 : చెన్నై పరాజయాల పరంపరం కంటిన్యూ.. వరుసగా నాలుగో ఓటమి..
చెన్నై వర్సెస్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో తొలుత పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు యువ బ్యాటర్ ప్రియాంశ్ ఆర్య కేవలం 42 బంతుల్లో 103 పరుగులతో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో ఏడు ఫోర్లు తొమ్మిది సిక్సులు ఉండటం గమనార్హం. ఐపీఎల్ 2025 సీజన్ లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్ ప్రియాంశ్. అంతకుముందు హైదరాబాద్ సన్ రైజర్స్ బ్యాటర్ ఇషాంత్ కిషన్ (106) సెంచరీ చేశాడు. అయితే, ప్రియాంశ్ ఆర్య తాజా సెంచరీతో ఆరు రికార్డులను నమోదు చేశాడు.
Also Read: IPL 2025 : ఉత్కంఠపోరులో లక్నో విజయం.. పోరాడి ఓడిన కేకేఆర్
ప్రియాంశ్ ఆరు రికార్డులివే..
♦ ప్రియాంశ్ ఆర్య 39 బంతుల్లో తన సెంచరీ పూర్తి చేశాడు. దీంతో భారత్ బ్యాటర్లలో రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్ గా నిలిచాడు. అంతకుముందు 2010లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన యూసుఫ్ పఠాన్ 37 బంతుల్లో సెంచరీ పూర్తిచేసి భారత క్రికెటర్ల జాబితాలో (ఫాస్టెస్ట్ సెంచరీ జాబితాలో) అగ్రస్థానంలో ఉన్నాడు.
♦ ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ప్రియాంశ్ నిలిచాడు. అతనికంటే ముందు ఈ రికార్డు 2022లో 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన రజత్ పాటిదార్ పేరిట ఉండగా.. ప్రియాంశ్ కేవలం 39 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్ లో సెంచరీ చేసిన 8వ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ప్రియాంశ్ నిలిచాడు.
♦ పంజాబ్ కింగ్స్ తరపున 2వ వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్ లో ప్రియాంశ్ ఆర్య నిలిచాడు. ఇప్పటి వరకు పంజాబ్ తరపున ఐపీఎల్ లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్ గా డేవిడ్ మిల్లర్ నిలిచాడు. అతను 2013లో 38 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.
♦ ఐపీఎల్ చరిత్రలో ఐదో వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్ గా ప్రియాంశ్ ఆర్య నిలిచాడు. అంతకుముందు క్రిస్ గేల్ 30 బంతుల్లో సెంచరీ పూర్తిచేయగా.. యూసుఫ్ పఠాన్ (37 బంతుల్లో), డేవిడ్ మిల్లర్ (38 బంతుల్లో), ట్రావిస్ హెడ్ (39 బంతుల్లో) సెంచరీలు పూర్తి చేశాడు. తాజాగా.. ప్రియాంశ్ ఆర్య సైతం 39 బంతుల్లో సెంచరీ సాధించడం ద్వారా ట్రావిస్ హెడ్ ను సమం చేశాడు.
♦ చెన్నై జట్టుపై అత్యంత వేగవంతమైన సెంచరీ చేయడం ద్వారా ప్రియాంశ్ ఆర్య 17ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఐపీఎల్ లో చెన్నై జట్టుపై అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు సనత్ జయసూర్య పేరిట ఉంది. జయసూర్య 2008లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నప్పుడు చెన్నై జట్టుపై 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇప్పుడు ప్రియాంశ్ ఆర్య 39 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.
♦ ఐపీఎల్ మ్యాచ్ లో మొదటి బంతికే సిక్స్ కొట్టిన నాల్గో బ్యాటర్ గా ప్రియాంశ్ ఆర్య నిలిచాడు. సీఎస్కే తో జరిగిన మ్యాచ్ లో ప్రియాంశ్ మొదటి బంతికే సిక్స్ కొట్టాడు. అంతకుముందు నమాన్ ఓజా (2009), విరాట్ కోహ్లీ (2019), ఫిల్ సాల్ట్ (2024)లో ఈ ఘనత సాధించాడు.
THE CELEBRATION FROM PREITY ZINTA AND SHREYAS WHEN PRIYANSH ARYA SCORED A HUNDRED. 🥹❤️pic.twitter.com/cTIJuwxOCe
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 8, 2025