IPL 2025 : కోల్‌కతాకు షాక్.. బోణీ కొట్టిన బెంగళూరు.. అదరగొట్టిన కోహ్లీ, సాల్ట్!
ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. కేకేఆర్ జట్టుపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ అర్ధ సెంచరీలతో బెంగళూరు ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది.

Image Credit : @BCCI / IPLT20.COM
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో సొంత గడ్డపై డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతాకు షాక్ తగిలింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. కేకేఆర్ జట్టుపై ఆర్సీబీ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 16.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులతో బెంగళూరు తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
Read Also : Kkr Vs Rcb: రాణించిన సునీల్ నరైన్, రహానె.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ అర్ధ సెంచరీలతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌ను తొలి విజయాన్ని అందుకుంది . తద్వారా బెంగళూరు జట్టు 2 ముఖ్యమైన పాయింట్లు సాధించింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున విరాట్ కోహ్లీ 36 బంతుల్లో అజేయంగా 59 పరుగులు చేయగా, ఫిల్ సాల్ట్ 31 బంతుల్లో 56 పరుగులు చేశాడు. బెంగళూరు తరఫున కెప్టెన్ రజత్ పాటిదార్ 16 బంతుల్లో 34 పరుగులు చేశాడు.
అంతకుముందు.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన లీగ్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మంచి ఆరంభం తర్వాత కోల్‌కతా భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో విఫలమైంది.
దాంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కోల్‌కతాకు ఆరంభంలో 4 పరుగుల వద్ద ఎదురుదెబ్బ తగిలింది. కానీ, అజింక్య రహానె, సునీల్ నరైన్ రెండో వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యంతో మ్యాచ్ మొత్తాన్నే మార్చేశారు.
Read Also : IPL 2025: టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌కు బీసీసీఐ షాక్
అయితే, బెంగళూరు బౌలర్లు రాణించడంతో వరుసగా వికెట్లు పడగొట్టారు. కోల్‌కతా తరఫున కెప్టెన్ అజింక్య రహానే అర్ధ సెంచరీ (56) చేయగా, సునీల్ నరైన్ కూడా 44 పరుగులు చేశాడు. బెంగళూరు తరఫున కృనాల్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టగా, జోష్ హాజిల్‌వుడ్ కూడా 2 వికెట్లు పడగొట్టాడు. బెంగళూరు బౌలర్ కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఐపీఎల్ 2025 ప్రారంభ వేడుకలో శ్రేయా ఘోషల్, దిశా పటాని, కరణ్ ఔజ్లా ప్రదర్శనలతో సందడి చేశారు. రింకూ, విరాట్ కోహ్లీ షారుఖ్‌తో కలిసి డ్యాన్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు.