IPL 2025: కేకేఆర్ కొంపముంచిన వర్షం.. ఫ్లే‌ఆఫ్స్ రేసు నుంచి ఔట్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి ఆర్సీబీ

గత సీజన్ లో అసాధారణ ప్రదర్శనతో విజేతగా నిలిచిన కేకేఆర్ జట్టుకు ఈ సీజన్ లో కలిసిరాలేదు.

IPL 2025: కేకేఆర్ కొంపముంచిన వర్షం.. ఫ్లే‌ఆఫ్స్ రేసు నుంచి ఔట్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి ఆర్సీబీ

BCCI Credit

Updated On : May 18, 2025 / 7:32 AM IST

IPL 2025: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ -2025 శనివారం పున: ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. మ్యాచ్ సమయంలో ఆగకుండా వర్షం పడటంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (RCB), కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. మ్యాచ్ రద్దుతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. అయితే, మ్యాచ్ రద్దు కావటంతో కేకేఆర్ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి.

Also Read: ఏంది మామ నువ్వు చెప్పేది.. కేకేఆర్‌తో మ్యాచ్ ర‌ద్దైనా ఆర్‌సీబీ ఇంకా ప్లేఆఫ్స్‌కు వెళ్ల‌లేదా? ఢిల్లీ, పంజాబ్‌ల‌తో లింక్ ఏంటి?

గత సీజన్ లో అసాధారణ ప్రదర్శనతో విజేతగా నిలిచిన కేకేఆర్ జట్టుకు ఈ సీజన్ లో కలిసిరాలేదు. ఆ జట్టులో పలువురు ప్లేయర్స్ ఆశించిన స్థాయిలో రాణించక పోవటంతోపాటు.. వర్షం కూడా ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసింది. వర్షం కారణంగా కేకేఆర్ ఆడాల్సిన రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి. కేకేఆర్ జట్టుకు సంబంధించి మొత్తం 13 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇందులో ఆ జట్టు ఐదు విజయాలు సాధించగా.. ఆరు మ్యాచ్‌లలో ఓడిపోయింది. రెండు మ్యాచ్‌లు ఫలితం తేలలేదు. ఫలితంగా పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో విజయం సాధించినా కేకేఆర్ జట్టు 14 పాయింట్లకు చేరుతుంది.

ఇప్పటికే మూడు జట్లు 14కు మించి పాయింట్లు సాధించాయి. 14పాయిట్లతో ఉన్న ముంబయి, 13 పాయింట్లతో ఉన్న ఢిల్లీ మధ్య మ్యాచ్ ఉండటంతో వాటిలో ఒక జట్టు 14 పాయింట్లను దాటుతుంది. దీంతో కోల్‌కతాకు ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు దారులున్నీ మూసుకుపోయాయి.

 

మ్యాచ్ రద్దుతో బెంగళూరు జట్టు ప్లే‌ఆఫ్స్ ఆశలను మరింత పదిలం చేసుకుంది. ఆ జట్టు మొత్తం 12 మ్యాచ్ లు ఆడగా (ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ రద్దయింది) 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంకు చేరుకుంది. ప్లే‌ఆఫ్స్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. కానీ, ఇంకో నాలుగు జట్లకు 17 పాయింట్లు సాధించే అవకాశం ఉండడంతో ఇంకా అధికారికంగా ఆ జట్టు ప్లేఆఫ్స్ కు చేరినట్లు కాదు. మరోవైపు ఆర్సీబీ మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. రెండింటిలో ఒక్క మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ అధికారికంగా ఖరారవుతుంది.

ఇదిలాఉంటే.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటికే ప్లే‌ఆఫ్స్ అవకాశాలు కోల్పోగా.. తాజాగా. కేకేఆర్ జట్టు ఆ జాబితాలో చేరింది.