RCB ఇంకా ప్లే ఆఫ్స్ కి చేరుకోలే.. ఇంకా ఇన్ని లిటిగేషన్స్ ఉన్నాయ్..
శనివారం చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది.

తొమ్మిది రోజుల తరువాత ఐపీఎల్ పునఃప్రారంభం కావడంతో మళ్లీ వినోదాన్ని ఆస్వాదిద్దామనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. కనీసం టాస్ వేసేందుకు కూడా వీలు లేకుండా పోయింది. దీంతో ఇరు జట్లకు ఒక్కొ పాయింట్‌ను కేటాయించారు.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని భావించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. మ్యాచ్ రద్దు కావడంతో కేకేఆర్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అఫీషియల్‌గా నిష్క్రమించింది. మరోవైపు కేకేఆర్ పై విజయం సాధించి అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం చేసుకోవాలని అనుకున్న ఆర్‌సీబీకి నిరాశ తప్పలేదు.
ఆర్‌సీబీ ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కేకేఆర్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఆర్‌సీబీ ఖాతాలో 17 పాయింట్లు ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ +0.482గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్లేఆఫ్స్ కు మరింత చేరువైంది.
ఢిల్లీ, పంజాబ్‌తో లింక్..
నేడు ఆదివారం (మే 18న) రాజస్థాన్ రాయల్స్‌తో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. కాగా.., నేటి మ్యాచ్‌ల్లో అటు పంజాబ్ గానీ, ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ గానీ (రెండింటిలో ఏదో ఒక జట్టు) ఓడిపోతే అప్పుడు ఆర్‌సీబీ అధికారికంగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. 13 పాయింట్లతో ఉన్న ఢిల్లీ ఐదో స్థానంలో ఉంది. పంజాబ్, ఢిల్లీలలో ఏదైన జట్టు నేడు ఓడిపోతే.. అప్పుడు టాప్-4లో ఆర్‌సీబీ ఖచ్చితంగా ఉంటుంది.