Rajat Patidar : నాకు ఇచ్చిన మాటను ఆర్‌సీబీ నిలబెట్టుకోలేదు.. మళ్లీ తిరిగి రావాలని అనుకోలేదు : రజత్ పాటిదార్ కామెంట్స్ వైరల్..
తనకు ఇచ్చిన మాటను ఆర్‌సీబీ తప్పిందని ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ తెలిపాడు.

కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ సారథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దుమ్ములేపుతోంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడగా 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ సారైనా టైటిల్ గెలవాలని ఆర్‌సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అదే జరిగితే.. ఆర్‌సీబీకి తొలి టైటిల్ అందించిన నాయకుడిగా రజత్ పాటిదార్ నిలుస్తాడు.
ఆర్‌సీబీ ఇచ్చిన మాట తప్పిందని, దీంతో మళ్లీ ఆర్‌సీబీకి ఆడకూడదని అనుకున్నట్లు రజత్ పాటిదార్ తెలిపాడు. ఈ సంగతి ఇప్పటిది కాదని 2022లో జరిగిన ఘటనను తాజాగా రజత్ గుర్తు చేసుకున్నాడు. ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో రజత్ మాట్లాడుతూ.. ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు తనకు ఆర్‌సీబీ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లుగా చెప్పాడు. తనని తీసుకోబోతున్నారని, సిద్ధంగా ఉండాలనేది ఆ ఫోన్ కాల్ సారాంశంగా తెలిపాడు.
దీంతో ఆర్‌సీబీకి మరోసారి ఆడబోతున్నానని ఎంతో సంతోష పడినట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే.. ఆ వేలంలో తనను కొనుగోలు చేయకపోవడంతో ఎంతో బాధపడినట్లు తెలిపాడు. దీంతో తాను స్థానిక మ్యాచ్‌లు ఆడుతూ ఉండగా.. ఆర్‌సీబీ నుంచి మరోసారి ఫోన్ వచ్చినట్లు చెప్పాడు.
‘లవ్‌నిత్ సిసోడియా గాయ పడడంతో అతడి స్థానంలో నన్ను తీసుకుంటున్నట్లుగా చెప్పారు. నిజం చెప్పాలంటే అప్పుడు నాకు ఆర్‌సీబీకి రావాలని అనిపించలేదు. ఎందుకంటే ఇంజూరీ రీప్లేస్‌మెంట్‌గా వెళితే నాకు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎక్కువగా అవకాశాలు రావు. ఎక్కువగా డగౌట్‌లోనే కూర్చోని మ్యాచ్‌లు చూడడం నాకు ఇష్టం లేదు.’ అని రజత్ చెప్పాడు.
ఇక కెప్టెనీ బాధ్యతలను అందుకోవడం గురించి మాట్లాడుతూ.. కెప్టెన్‌గా తన పేరును ప్రకటించగానే ఎన్నో సందేహాలు చుట్టుముట్టినట్లుగా తెలిపాడు. చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నారు, కోహ్లీ తన కెప్టెన్సీలో ఆడతాడా? అని సందేహించినట్లుగా చెప్పాడు. అయితే.. ఈ విషయంలో కోహ్లీ తనకు ఎంతో అండగా నిలిచాడన్నాడు.
ఇది ఓ అవకాశంగా బావిస్తున్నట్లు రజత్ చెప్పాడు. వీలైనంతగా నేర్చుకుంటానని అన్నాడు. ఓ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా విజయవంతం అయ్యేందుకు కోహ్లీ ఎన్నో సూచనలు చేశాడని రజత్ తెలిపాడు. ఆర్‌సీబీ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజు తన కెరీర్‌లో చిరస్మరణీయమైన రోజుల్లో ఒకటి అని అన్నాడు.