RCB vs KKR : అరె ఏంట్రా ఇదీ.. ఆర్‌సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. రద్దైతే ప్లేఆఫ్స్‌కు బెంగళూరు?
బెంగళూరు వేదికగా జరగనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది.

Rain Threat for RCB vs KKR Will RCB Qualify if IPL 2025 Match Is a Washout
భారత్, పాక్ ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2025 సీజన్ శనివారం (మే 17) నుంచి ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.
గత రెండు రోజులుగా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువార సాయంత్రం కూడా వర్షం కురవడంతో ఆర్‌సీబీ ఆటగాళ్ల ప్రాక్టీస్‌కు అంతరాయం ఏర్పడింది. అందుకున్న నివేదికల ప్రకారం.. ఆర్‌సీబీ, కేకేఆర్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిలా మారే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో 65 శాతానికి పైగా వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు అక్యూవెదర్ తెలిపింది. ఉష్ణోగ్రత గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 22 డిగ్రీలు ఉంటుందని అంచనా వేసింది.
అయితే.. ఎంత భారీ వర్షం కురిపినప్పటికి కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉంది. వర్షం ఆగిన తరువాత 30 నుంచి గంట సమయంలోనే మ్యాచ్‌కు మైదానాన్ని సిద్ధం చేయొచ్చు. ఈ నేపథ్యంలో ఆర్‌సీబీ కేకేఆర్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యే అవకాశాలు దాదాపుగా లేనట్లే. అయితే.. ఓవర్లు కుదించొచ్చు.
ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో బెంగళూరు అదరగొడుతోంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడగా 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ +0.482గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో గెలిస్తే ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతోంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే.. అప్పుడు ఇరు జట్లకు ఒక్కొ పాయింట్ ను కేటాయిస్తారు. దీంతో 17 పాయింట్లతో ఆర్‌సీబీ నాలుగు జట్లలో ఓ జట్టుగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది.
మరోవైపు కేకేఆర్ పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడగా 5 మ్యాచ్‌ల్లోనే గెలుపొందింది. మరో 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఆ జట్టు ఖాతాలో 11 పాయింట్లు ఉండగా నెట్‌రన్‌రేట్ +0.193గా ఉంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం కేకేఆర్ ఆరో స్థానంలో ఉంది. బెంగళూరు చేతిలో ఓడిపోతే కేకేఆర్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమిస్తుంది.