PBKS vs MI : ముంబై పై విజయం.. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు.. ఒకరినొకరు వెన్నుపోటు పొడుచుకోవడం సులభం..
పదేళ్ల విరామం తరువాత ఐపీఎల్ లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది పంజాబ్ కింగ్స్.

Courtesy BCCI
పదేళ్ల విరామం తరువాత ఐపీఎల్ లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది పంజాబ్ కింగ్స్. అదే ఊపులో క్వాలిఫయర్ ఆడే అవకాశాన్ని అందుకుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో పంజాబ్‌కు టాప్-2లో స్థానం ఖాయమైంది. ఈ క్రమంలో తన జట్టు ఆటగాళ్లపై శ్రేయస్ అయ్యర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్ 2025లో జట్టు అద్భుతమైన ప్రదర్శన ప్రతి ఆటగాడి నమ్మకాన్ని పొందడానికి తనకు సహాయపడుతుందన్నాడు.
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (57; 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సెన్, విజయ్‌కుమార్ వైశాఖ్ లు తలా రెండు వికెట్లు తీశారు. హర్‌ప్రీత్ బ్రార్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం జోష్ ఇంగ్లిస్ (73; 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), ప్రియాంశ్ ఆర్య (62; 35 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టడంతో లక్ష్యాన్ని పంజాబ్ 18.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. ముంబై బౌలర్లలో మిచెల్ శాంట్నర్ రెండు వికెట్లు తీశాడు. జస్‌ప్రీత్ బుమ్రా ఓ వికెట్ పడగొట్టాడు.
ఈ విజయంతో 2014 తర్వాత పంజాబ్ కింగ్స్ ఐపీఎల్‌లో తొలిసారి ప్లేఆఫ్స్‌కు చేరింది. మే 29న జరగనున్న క్వాలిఫయర్ 1 కోసం ముల్లన్‌పూర్‌లోని తమ సొంత మైదానానికి వెళ్లనుంది.
ఇదిలా ఉంటే.. ముంబై పై విజయం సాధించడం, క్వాలిఫయర్‌కు అర్హత సాధించడం పై పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. ప్రతి ఒక్కరు సరైన సమయంలో బాధ్యత తీసుకుని ఆడారని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు అయ్యర్ చెప్పాడు. ఎలాంటి పరిస్థితిలోనైనా మనం గెలవాలి అనే మనస్తత్వంలో జట్టు ఉందన్నాడు. పంజాబ్ కింగ్స్ విజయంలో రికీ పాంటింగ్ నేతృత్వంలోని జట్టు యాజమాన్యం కీలక పాత్ర పోషించిందని చెప్పాడు.
RCB : ఆర్‌సీబీకి లక్నో ‘టెన్షన్’.. కోహ్లీ ఆశ నెరవేరేనా?
తాను ప్రతి వ్యక్తి నమ్మకాన్ని పొందడం గురించి మాట్లాడుతూ.. అది మ్యాచ్‌లను గెలవడం ద్వారానే సాధ్యమైందన్నాడు. వ్యక్తిగతంగా మనం ఆ సంబంధాన్ని కొనసాగించాలని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. ఇక ఎవరైనా సరే నిరాశలో ఉన్నప్పుడు ఒకరినొకరు వెన్నుపోటు పొడుచుకోవడం చాలా సులభం అని అయ్యర్ తెలిపాడు.
ప్రియాన్ష్ గురించి మాట్లాడుతూ.. అతడు ఆటను ప్రారంభించిన విధానం అద్భుతంగా ఉంది. యువ ఆటగాళ్ళు నిర్భయంగా ఉంటారు. వారు నెట్స్‌లో ఎంతో కష్టపడుతారు. దాని ఫలితం ఇప్పుడు మైదానంలో కనిపిస్తుంది. అని అయ్యర్ అన్నాడు.
IPL 2025 : పోతూ.. పోతూ.. ధోని సేన ఎంత పని చేసింది మామ.. నాలుగు టీమ్‌ల భవిష్యత్తే మారిపోయిందిగా..
జోస్ ఇంగ్లిష్ గురించి మాట్లాడుతూ.. అతడు కొంత బంతిని ఆడేందుకు చాలా ఇష్టపడుతాడని చెప్పుకొచ్చాడు. ‘అతడు మ్యాచ్ విన్నర్. అందుకనే అతడు మరిన్ని బంతులను ఆడాలని భావించే బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపాము. అతడు ఇదే విధంగా రాణిస్తాడని భావిస్తున్నాను.’ అని అయ్యర్ అన్నాడు.