IPL 2025 : పోతూ.. పోతూ.. ధోని సేన ఎంత పని చేసింది మామ.. నాలుగు టీమ్‌ల భవిష్యత్తే మారిపోయిందిగా..
ఆదివారం గుజరాత్ టైటాన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడంతో టాప్-2 రేసు మరింత ఉత్కంఠగా మారింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లు ఏవో ఇప్పటికే తెలిసినప్పటికి కూడా.. ఇంకా టాప్-2లో నిలిచే జట్లు ఏవో తేలలేదు. లీగ్ దశ ముగిసే నాటికి టాప్-2లో నిలిచేందుకు నాలుగు జట్లు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌లు పోటీపడుతున్నాయి.
ఆదివారం గుజరాత్ టైటాన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడంతో టాప్-2 రేసు మరింత ఉత్కంఠగా మారింది. చెన్నైతో మ్యాచ్‌లో గెలిచి ఉంటే గుజరాత్ జట్టు అగ్రస్థానంతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టేది. ఇప్పుడు ఓడిపోవడంతో గుజరాత్ టాప్-2 అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. అదే సమయంలో ఆర్‌సీబీ, పంజాబ్, ముంబైలకు చెన్నై విజయం సాధించడం బాగా కలిసి వచ్చింది.
పంజాబ్, ముంబైల మధ్య కీలక మ్యాచ్..
సోమవారం పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా అగ్రస్థానానికి చేరుకుంటుంది. పంజాబ్ గెలిస్తే 19 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉంటాయి. అదే ముంబై విజయం సాధిస్తే 18 పాయింట్లతో గుజరాత్ తో సమంగా పాయింట్లు ఉంటాయి. కానీ గుజరాత్ (+0.254) కంటే మెరుగైన నెట్ రన్‌రేట్ కలిగి ఉండడం ముంబై(+1.292)కి కలిసి వస్తుంది.
లక్నో పై గెలిస్తే..
ఇక ఆర్‌సీబీ తన చివరి మ్యాచ్‌ను మే 27 లక్నోతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలిస్తే మిగిలిన జట్లతో సంబంధం లేకుండా టాప్-2లో నిలుస్తుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం మూడు లేదా నాలుగు స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. లక్నోతో మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడిపోతే అప్పుడు గుజరాత్ టాప్-2లో ఉంటుంది.
మొత్తంగా చెన్నై విజయం సాధించడంతో భవిష్యత్తే మారిపోయింది. కాగా.. పోతూ పోతూ ధోని సేన ఎంత పని చేసిందిరా అయ్యా అని అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.