SRH : ఐపీఎల్ 2026 ముందు సన్‌రైజర్స్ కీలక నిర్ణయం..! వేలంలోకి హెన్రిచ్ క్లాసెన్?
ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ (SRH) కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
                            IPL 2026 rumours SRH to release Heinrich Klaasen before auction
SRH : ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 6 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. మరో ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ రద్దు కాగా.. 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో సీజన్‌ను ముగించింది. ఈ క్రమంలో ఐపీఎల్ 2026లో రాణించాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో జట్టులో పలు మార్పులకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది.
ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు ఆ జట్టు స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్‌ను వేలానికి విడిచిపెట్టేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు క్లాసెన్‌ను రూ.23 కోట్లకు ఎస్ఆర్‌హెచ్ రిటైన్ చేసుకుంది. ఈ మొత్తం కెప్టెన్ పాట్ కమిన్స్ (రూ.18కోట్లకు) కంటే కూడా చాలా అధికమొత్తం. ఈ నేపథ్యంలోనే క్లాసెన్‌ను వేలానికి విడిచి పెట్టి తమ పర్స్ వాల్యూను పెంచుకోవాలని, అదే సమయంలో అతడిని వేలంలో తక్కువ ధరకు దక్కించుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
వేలంలో క్లాసెన్‌కు తక్కువ ధరకు దక్కించుకుంటే మిగిలిన మొత్తాన్ని పేసర్లు, ఆల్‌రౌండర్ల కోసం వినియోగించుకోవాలని ఎస్ఆర్ఆర్ ఆలోచిస్తుందని అంటున్నారు. ఎందుకంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లతో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. ఈ క్రమంలోనే.. బౌలింగ్, ఆల్‌రౌండ్ విభాగాలను మెరుగుపరచుకుని ఐపీఎల్ 2026లో కప్పు కొట్టాలని ఆశిస్తుందట.
గత మూడు సీజన్లలో అత్యంత నిలకడ ఆటగాడు క్లాసనే..
ఐపీఎల్ 2023, 2024, 2025 సీజన్లలో సన్‌రైజర్స్ తరుపున హెన్రిచ్ క్లాసెన్ అత్యంత నిలకడైన ప్రదర్శన చేశాడు. అతడు వరుసగా 448, 479, 487 పరుగుల చొప్పున సాధించాడు. మూడు సీజన్లలో 39 ఇన్నింగ్స్‌ల్లో 173.50 స్ట్రైక్‌రేటుతో 1414 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, ఏడు అర్థశతకాలు ఉన్నాయి.
అయితే.. ఇంత స్థిరంగా రాణిస్తున్న క్లాసెన్‌ను వదులుకునేందుకు సన్‌రైజర్స్ నిజంగా సిద్ధంగా ఉందో లేదో చూడాల్సిందే. ఒకవేళ అతడిని విడిచిపెట్టి.. వేలంలో దక్కించుకోలేకపోతే అది జట్టుకు తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఎందుకంటే మిడిల్ ఆర్డర్‌లో అతడిలా నిలకడగా మరే సన్‌రైజర్స్ ఆటగాడు ఆడడం లేదు.
ఒకవేళ కాస్లెన్ ను వేలంలో దక్కించుకోలేకపోతే ఎస్ఆర్‌హెచ్ జట్టు వేలంలో ఆసీస్ స్టార్ ఆటగాడు కామెరూన్ గ్రీన్ కోసం ప్రయత్నించవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి సన్‌రైజర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలుసుకోవాలంటే నవంబర్ 15 వరకు ఆగక తప్పదు. అది రిటైర్ లిస్ట్‌కు చివరి తేదీ అన్న సంగతి తెలిసిందే.
