HCA Elections 2023: హెచ్‌సీఏ అధ్యక్షుడిగా పోటీకి అర్శనపల్లి జగన్మోహన్ రావు నామినేషన్
అక్టోబరు 20న ఎన్నికలు జరుగుతాయి. అదే రోజున ఫలితాలు వెల్లడవుతాయి. హెచ్‌సీఏ అధ్యక్షుడితో పాటు..

Jagan Mohan Rao
Jagan Mohan Rao: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు అర్శనపల్లి జగన్మోహన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ కొన్ని రోజుల క్రితమే విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 11 నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు.
శుక్రవారం నామినేషన్ల స్వీకరణకు గడువు ముగిసింది. అక్టోబరు 20న ఎన్నికలు జరుగుతాయి. అదే రోజున ఫలితాలు వెల్లడవుతాయి. హెచ్‌సీఏ అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షుడు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఈసీ సభ్యులను ఈ ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. దీంతో అర్శనపల్లి జగన్మోహన్ రావు ప్యానెల్ సభ్యులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు.
ఉప్పల్ స్టేడియంలో నామినేషన్లు సమర్పించిన అనంతరం జగన్మోహన్ రావు మాట్లాడుతూ తమ ప్యానెల్ పేరును యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ అని ప్రకటించారు. తమ ప్యానెల్ నుంచి ఉపాధ్యక్షుడిగా పి.శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా ఆర్.హరినారాయణ, సహాయ కార్యదర్శిగా నోయల్ డేవిడ్, కోశాధికారిగా సీజే శ్రీనివాస్, కౌన్సిలర్‌గా అన్సర్ అహ్మద్ ఖాన్ పోటీ చేస్తారని తెలిపారు. గతంలో జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం ద్వారా ఆ క్రీడాభివృద్ధికి జగన్మోహన్ రావు కృషి చేశారు.
కాగా, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ పేరును ఆ అసోసియేషన్ ఓటరు జాబితా నుంచి ఇప్పటికే తొలగించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేశారు. ఆయన హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే, డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా కొనసాగినందుకు ఈ అనర్హత వేశారు. ప్రస్తుతం జస్టిస్ లావు నాగేశ్వరరావు చేతిలోనే హెచ్‌సీఏ బాధ్యతలు ఉన్నాయి.
Babar Azam: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వేళ.. బాబర్ అజామ్ కామెంట్స్