IND vs ENG 5th Test : తిప్పేసిన స్పిన్న‌ర్లు.. దంచికొడుతున్న బ్యాట‌ర్లు.. ధ‌ర్మ‌శాల‌లో తొలి రోజు టీమ్ఇండియాదే

ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న ఆఖ‌రి, ఐదో టెస్టు మ్యాచ్‌లోనూ టీమ్ఇండియా దుమ్ములేపుతోంది.

IND vs ENG 5th Test : తిప్పేసిన స్పిన్న‌ర్లు.. దంచికొడుతున్న బ్యాట‌ర్లు.. ధ‌ర్మ‌శాల‌లో తొలి రోజు టీమ్ఇండియాదే

IND vs ENG 5th Test

Updated On : March 8, 2024 / 10:40 AM IST

ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న ఆఖ‌రి, ఐదో టెస్టు మ్యాచ్‌లోనూ టీమ్ఇండియా దుమ్ములేపుతోంది. తొలుత భార‌త స్పిన్న‌ర్లు ఇంగ్లాండ్‌ను తిప్పేయ‌గా, బ్యాట‌ర్లు దంచుడు మొద‌లుపెట్టారు. మొత్తంగా తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్‌లో వికెట్ న‌ష్ట‌పోయి 135 ప‌రుగులు చేసింది. రోహిత్ శ‌ర్మ (52; 83 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), శుభ్‌మ‌న్ గిల్ (26; 39 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భార‌త్ ఇంకా 83 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది.

దంచికొట్టిన ఓపెన‌ర్లు..

ఇంగ్లాండ్ ను ఆలౌట్ చేసిన త‌రువాత తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భార‌త్‌కు ఓపెన‌ర్లు య‌శ‌స్వి జైస్వాల్ (57; 58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) రోహిత్ శ‌ర్మ లు తొలి వికెట్‌కు 106 ప‌రుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. ఆరంభంలో రోహిత్ దూకుడుగా ఆడ‌గా, స్పిన్న‌ర్లు రంగ ప్ర‌వేశం చేసిన త‌రువాత య‌శ‌స్వి దంచుడు మొద‌లు పెట్టాడు. షోయ‌బ్ బ‌షీర్ వేసిన ఓ ఓవ‌ర్‌లో అత‌డు మూడు సిక్స‌ర్లు బాదాడు. ఆ త‌రువాత కూడా అదే జోరును కొన‌సాగిస్తూ 56 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు.

Rohit Sharma : చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో 50 సిక్స‌ర్లు

అయితే.. మ‌రో రెండు బంతుల‌కే షోయ‌బ్ బ‌షీర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించి స్టంపౌట్ అయ్యాడు. అటు రోహిత్ శ‌ర్మ త‌న‌దైన శైలిలో ప‌రుగులు రాబ‌డుతూ 77 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. గిల్‌తో క‌లిసి మ‌రో వికెట్ ప‌డ‌కుండా మొద‌టి రోజును ముగించాడు.

కుల్దీప్‌, అశ్విన్ మాయ‌..

అంత‌క‌ముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెన‌ర్లు జాక్‌క్రాలీ (79; 108 బంతుల్లో 11 ఫోర్లు, 1సిక్స్‌), బెన్‌డ‌కెట్ (27; 58 బంతుల్లో 4 ఫోర్లు) లు భార‌త పేస‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నారు. తొలి గంట పాటు వికెట్ ఇవ్వ‌కుండా ఆచితూచి ఆడారు. ఈ క్ర‌మంలో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స్పిన్న‌ర్ కుల్దీప్ చేతికి బాల్‌ను అందించ‌డం క‌లిసి వ‌చ్చింది. అత‌డు త‌న తొలి ఓవ‌ర్‌లోనే బెన్‌డ‌కెట్‌ను ఔట్ చేశాడు. దీంతో 64 ప‌రుగుల తొలి వికెట్ భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది.

జాక్‌క్రాలీ ఓవైపు త‌న‌దైన శైలిలో భార‌త బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. ఓలిపోప్ (11) విఫ‌లం అయినా జోరూట్ (26) జ‌త‌గా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకువెళ్లాడు. ఈ క్ర‌మంలో అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న ఈ జోడీని క్రాలీని బౌల్డ్ చేయ‌డం ద్వారా కుల్దీప్ యాద‌వ్ విడ‌దీశాడు. రూట్‌-క్రాలీ జోడీ మూడో వికెట్‌కు 37 ప‌రుగులు జోడించింది. ఆ త‌రువాత వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న బెయిర్ స్టో (29; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్స‌ర్లు) దంచ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు.

Ashwin : హాస్పిట‌ల్‌ బెడ్ పై ఉన్న అమ్మ నాకు చెప్పింది అదే : ర‌విచంద్ర‌న్ అశ్విన్‌

అయితే.. ఈ ద‌శ‌లో భార‌త బౌల‌ర్లు విజృంభారు. దీంతో ఓ ద‌శ‌లో 175/4తో ప‌టిష్టంగా ఉన్న ఇంగ్లాండ్ 218 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. భార‌త బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్ ఐదు వికెట్లు తీయ‌గా, ర‌విచంద్ర‌న్ అశ్విన్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ర‌వీంద్ర జ‌డేజా ఓ వికెట్ సాధించాడు.