కుట్ర జరుగుతుందా?: టీ20ల నుంచి తప్పుకుంటున్న మిథాలీ రాజ్

కుట్ర జరుగుతుందా?: టీ20ల నుంచి తప్పుకుంటున్న మిథాలీ రాజ్

Updated On : February 6, 2019 / 4:47 AM IST

టీమిండియా వన్డే కెప్టెన్ సీనియర్‌ క్రీడాకారిణి మిథాలీ రాజ్‌ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే సమయం ఆసన్నమైంది. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో సిరీస్‌ అనంతరం షార్ట్ ఫార్మాట్ నుంచి మిథాలీ తప్పుకోనున్నట్లు బీసీసీఐ అధికారి తెలిపారు. టీ20లకు దూరమైనా.. వన్డేల్లో కొనసాగుతుందట. బుధవారం వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభంకానుండగా.. తుదిజట్టులో మిథాలీ ఉంటుందా అనే విషయంపై స్పష్టత రాలేదు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు మిథాలీని ఎంపిక చేసినా.. 3 మ్యాచ్‌లలో ఆడే విషయంపై అనుమానులు తలెత్తాయి. 

ఈ విషయంపై బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. ‘2020 టీ20 ప్రపంచ కప్‌కు హర్మన్‌ప్రీత్‌ జట్టును సిద్ధం చేసుకుంటుందన్న సంగతి మిథాలీ అర్థం చేసుకోగలదు. ఆ టోర్నీలో ఆమె ఆడకపోవచ్చు. ఐతే మిథాలీ వంటి దిగ్గజ క్రీడాకారిణికి ఘనంగా వీడ్కోలు పలకాలి’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. 

మిథాలీ తప్పుకుంటుందా.. తప్పిస్తున్నారా..?
భారత మహిళా జట్టు మాజీ కోచ్‌ రమేశ్ పవార్.. మిథాలీల మధ్య జరిగిన వివాదం పెద్ద దుమారమే రేపింది. గతేడాది నవంబరు నెలలో టీ20 వరల్డ్‌కప్ సెమీస్‌లో ఇంగ్లండ్‌తో తలబడిన మ్యాచ్‌లో వన్డే కెప్టెన్ మిథాలీరాజ్‌కు విశ్రాంతి కల్పించారు.  ఇందులో అప్పటి కోచ్ రమేశ్ పవార్.. కుట్రపూరితంగా వ్యవహరించాడని తన వివక్షను ప్రదర్శించాడంటూ మిథాలీ బీసీసీఐకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అప్పటి వివాదానికి తాత్కాలికంగా ఉపశమనం పలికినా.. అది మనస్సులో పెట్టుకునే మిథాలీని టీ20ల నుంచి తప్పిస్తున్నారా.. అనేది సగటు క్రీడాభిమానికి సందిగ్ధంగా మారింది.