Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత్ బ్యాటర్లు.. విరాట్, రోహిత్, శ్రేయాస్ ఏ స్థానంలో ఉన్నారంటే..

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మ్యాచ్ రేపు (ఆదివారం) దుబాయ్ వేదికగా జరగనుంది. టీమిండియా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్స్ లో ..

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత్ బ్యాటర్లు.. విరాట్, రోహిత్, శ్రేయాస్ ఏ స్థానంలో ఉన్నారంటే..

Rohit Sharma and Virat Kohli

Updated On : March 8, 2025 / 7:18 AM IST

Champions Trophy Final: రసవత్తర సమరానికి వేళైంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మ్యాచ్ రేపు (ఆదివారం) దుబాయ్ వేదికగా జరగనుంది. టీమిండియా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్స్ లో తలపడనున్నాయి. భారత్ జట్టు విజయం సాధించాలంటే ముఖ్యంగా కీలక బ్యాటర్లు రాణించాల్సిన అవసరం ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో ఉంటే భారత్ విజయం తేలిక అవుతుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

 

విరాట్ కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా లీగ్ దశలో సెంచరీతో అదరగొట్టిన కోహ్లీ, సెమీ ఫైనల్ మ్యాచ్ లోనూ ఆస్ట్రేలియాపై అద్భుత బ్యాటింగ్ తో జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు. మరోవైపు రోహిత్ శర్మకూడా రాణిస్తే భారత్ జట్టు విజయం ఈజీ అవుతుంది. ఇదిలాఉంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన పది మంది భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉన్నాడు.

 

విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. ప్రపంచ క్రికెట్ లో ఈ జాబితాలో క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉండగా.. కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. మొత్తం 17 మ్యాచ్ లకుగాను 16 ఇన్నింగ్స్ లలో కోహ్లీ 746 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

 

ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్ శిఖర్ ధావన్. అతను 10 మ్యాచ్ లలో 701 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. మూడు నాలుగు స్థానాల్లో సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. సౌరవ్ గంగూలీ 13 మ్యాచ్ లకుగాను 11 ఇన్నింగ్స్ లలో 665 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. రాహుల్ ద్రవిడ్ 19 మ్యాచ్ లకుగాను 15 ఇన్నింగ్స్ లలో 627 పరుగులు చేశాడు. ఆరు ఆఫ్ సెంచరీలు ఉన్నాయి.

 

ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో ఐదో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ ప్రస్తుతం టీమిండియాకు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. అతను ఇప్పటి వరకు 14 ఇన్నింగ్స్ లలో 585 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆ తరువాతి స్థానాల్లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు.

 

సచిన్ టెండూల్కర్ 16 మ్యాచ్ లకుగాను 15 ఇన్నింగ్స్ లలో 441 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, ఒక ఆఫ్ సెంచరీ ఉంది. వీరేంద్ర సెహ్వాగ్ 10 మ్యాచ్ లలో 389 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, రెండు ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. యువరాజ్ సింగ్ 18 మ్యాచ్ లకుగాను 13 ఇన్నింగ్స్ లలో 376 పరుగులు చేశాడు. మూడు ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక తొమ్మిదో స్థానంలో మహ్మద్ కైఫ్ ఉన్నాడు. అతను ఎనిమిది మ్యాచ్ లలో 236 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. పదో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడు. అతను ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇప్పటి వరకు నాలుగు ఇన్నింగ్స్ లలో 195 పరుగులు చేశాడు. ప్రస్తుతం టీమిండియా జట్టులో ఉన్నాడు.