అస్సలేం జరిగింది: రాష్ట్రపతిని కలిసిన ధోనీ

జార్ఖండ్‌లోని రాంచీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చాలాసేపు ముచ్చటించి డిన్నర్‌లో పాల్గొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు కొన్ని నెలలుగా దూరమైన ధోనీ రాష్ట్రపతిని కలవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత వారం జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బిలియార్డ్స్ ఆడుతూ కనిపించిన ధోనీ రాష్ట్రపతితో ఆదివారం డిన్నర్ లో పాల్గొన్నారు.
జార్ఖండ్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా వచ్చిన రాష్ట్రపతిని ధోనీ రాజ్‌భవన్‌లో కలుసుకున్నాడు. ఆదివారం ఉదయం సమయంలో కోవింద్ గుల్మా జిల్లాలో పర్యటించారు. ఆ తర్వాత భారీ వర్షం పడుతుండటంతో పర్యటన రద్దు చేసుకున్నారు. దీంతో ధోనీకి ఆయనను కలిసే అవకాశం దొరికింది.
2007టీ20 వరల్డ్ కప్ జట్టుకు కెప్టెన్ గా నిలిచి గెలిపించిన మహేంద్ర సింగ్ ధోనీ మరో టీ20 వరల్డ్ కప్ లో ఆడాలనే ఆశాభావం వ్యక్తం అవుతోంది. ఇటీవల చిన్నారులతో ఆడుతూ గల్లీ క్రికెట్ వీడియోలను పోస్టు చేశాడు ధోనీ. గాయం కారణంగా ధోనీ నవంబరు వరకూ టీమిండియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. రెండు నెలల విరామంలో భాగంగా వెస్టిండీస్ పర్యటనను మిస్ అయిన ధోనీ మళ్లీ వెస్టిండీస్ జట్టు భారత పర్యటన చేసే సమయానికి టీమిండియాలో భాగం కానున్నాడు.