World Cup 2019: టీమిండియా ధోనీ చుట్టూ తిరుగుతూ.. ఉంటుంది

World Cup 2019: టీమిండియా ధోనీ చుట్టూ తిరుగుతూ.. ఉంటుంది

Updated On : February 18, 2019 / 1:05 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చుట్టూనే భారత జట్టు తిరుగుతూ ఉంటుందని టీమిండియా మాజీ క్రికెటర్ మొహ్మద్ కైఫ్ అంటున్నాడు. వరల్డ్ కప్ 2019 జట్టులో ధోనీ ఉండాల్సిందేనని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల ఓ ప్రైవేటు మీడియా ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కైఫ్ ఇలా మాట్లాడాడు.  ‘మైదానంలో మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా.. బౌలర్లకు ఏం చేయాలో తెలియకపోయినా.. ఫీల్డింగ్‌లో పొజిషన్ మార్చాలన్నా.. ధోనీ దగ్గరకు వెళ్లాల్సిందే. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం సలహాల కోసం ధోనీ దగ్గరకి వెళ్తుంటాడు. అంతగుడ్డిగా నమ్మేస్తాడు ధోనీని కోహ్లీ’

‘టీమిండియాలో కీ రోల్ వహిస్తున్నాడు మహీ. ప్రతి మ్యాచ్‌లోనూ  అద్భుతాలు సృష్టిస్తాడు. ప్రపంచ కప్ జట్టులో ధోనీ ఉంటే కప్ గెలుచుకునేందుకు అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల్లో ధోనీ కనబరచిన ఫామ్ అందరినీ ఆకట్టుకుంది. అలాంటి నాయకుడు ఉంటే జట్టు చక్కటి ప్రేరణ పొందుతుంది. ఆడినప్పటి నుంచి అసమాన ప్రతిభతో ఆడి అద్భుతాలు సృష్టిస్తున్నాడు’  అని ధోనీని కొనియాడాడు. 

ప్రపంచ కప్ గెలుచుకునే జట్లలో టీమిండియా, ఇంగ్లాండ్‌లు మాత్రమే ఫేవరేట్లుగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించాడు. గేమ్ ఛేంజర్‌గా నిలిచిన కోహ్లీ ఈ సారి ధోనీ సహాయంతో ప్రపంచ కప్ సాధిస్తాడని నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.