చెన్నై చేతులెత్తేసింది.. 6వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం

చెన్నై చేతులెత్తేసింది.. 6వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం

Updated On : May 7, 2019 / 5:40 PM IST

క్వాలిఫైయర్ 1మ్యాచ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ సొంతగడ్డపై ముంబై ఇండియన్స్ విజయభేరీ మోగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై 132 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోలేకపోయింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ 6వికెట్ల తేడాతో ప్లేఆఫ్ మ్యాచ్‌లలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. 

క్వాలిఫైయర్ 1లో విజయం సాధించిన ముంబై నేరుగా ఫైనల్‌కు వెళ్లనుండగా ఏప్రిల్ 8వ తేదీ జరగనున్న మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో సూపర్ కింగ్స్ ఆడి గెలిస్తే ఫైనల్‌కు వెళ్లే అవకాశం ఉంది. బుధవారం జరగనున్న మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఢిల్లీ క్యాపిటల్స్‌ల మధ్య వైజాగ్ స్టేడియం వేదికగా జరగనుంది. 

ఆరంభం నుంచి తడబడిన చెన్నై.. ముంబై ఇన్నింగ్స్‌లోనూ పుంజుకోలేకపోయారు. ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ(4), క్వింటన్ డికాక్(8)లను దీపక్ చాహర్, హర్భజన్ సింగ్‌లు అవుట్ చేసినప్పటికీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ పాతుకుపోయారు. సూర్యకుమార్ యాదవ్(71నాటౌట్; 54 బంతుల్లో 10ఫోర్లు)తో జట్టుకు అద్భుతమైన స్కోరు అందించగలిగాడు. మరో ఎండ్‌లో దిగిన ఇషాన్ కిషన్(28)తాహిర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కృనాల్ పాండ్యా(0)డకౌట్‌గా వెనుదిరగడంతో మ్యాచ్ ముగింపు బాధ్యతలు తీసుకున్న హార్దిక్ పాండ్యా(13; 11బంతుల్లో 1ఫోర్)తో ముగించేశాడు. 

అంతకంటే ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌ను ముంబై బౌలర్లు ఘోరంగా కట్టడి చేశారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌కు 132 పరుగుల టార్గెట్ నిర్దేశించారు. ఆరంభం నుంచి సూపర్ కింగ్స్‌ను ఒత్తిడికి గురిచేయడంతో స్కోరు బోర్డు నత్తనడకన సాగింది. ఓపెనర్లు డుప్లెసిస్(6), షేన్ వాట్సన్(10)పరుగులకే సరిపెట్టకోవడంతో సురేశ్ రైనా కూడా వారి బాటలోనే (5)పరుగులకే పరిమితమయ్యాడు. 

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మురళీ విజయ్(26; 26 బంతుల్లో 3ఫోర్లు చేయడంతో కొద్ది సేపు వికెట్లు కాపాడుకోగలిగారు. మరో ఎండ్‌లో బ్యాటింగ్‌కు దిగిన అంబటి రాయుడు(42; 37బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సు) రాణించాడు. విజయ్ అవుట్ తర్వాత ధోనీ(37; 29బంతుల్లో 3సిక్సులు) బ్యాటింగ్‌కు దిగి కెప్టెన్ ఇన్నింగ్స్ అందించాడు.