CSK vs SRH : చెన్నై పై విజయం.. సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు..
చెన్నై పై విజయం సాధించడంపై సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ స్పందించాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. తప్పక గెవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత చెన్నై గడ్డపై విజయబావుట ఎగురవేసింది. సమిష్టి ప్రదర్శనతోనే విజయం సాధించామని ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు. పిచ్ కండిషన్స్ బట్టి బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేశామన్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.5 ఓవర్లలో 154 పరుగులకే కుప్పకూలింది. చెన్నై బ్యాటర్లలలో డెవాల్డ్ బ్రెవిస్ (42), ఆయుష్ మాత్రే (30)లు రాణించారు. దీపక్ హుడా (22), రవీంద్ర జడేజా (21) లు ఫర్వాలేదనిపించగా, ఎంఎస్ ధోని (5), సామ్ కుర్రాన్ (9), శివమ్ దూబె (12)లు విఫలం అయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్ చెరో రెండు వికెట్లు తీశారు. షమీ, కమిందు మెండీస్ తలా ఓ సాధించారు.
అనంతరం లక్ష్యాన్ని సన్‌రైజర్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (44), కమిందు మెండిస్ (32నాటౌట్)లు రాణించారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, రవీంద్ర జడేజాలు తలా ఓ వికెట్ తీశారు.
మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించడం పట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇదొ గొప్ప విషయం అని చెప్పుకొచ్చాడు. కొన్ని విషయాలు కలిసి వచ్చాయని తెలిపాడు. కుర్రాళ్లు అద్భుతంగా ఆడారని కితాబు ఇచ్చాడు. బౌలర్లు సమిష్టిగా రాణించారని అన్నాడు.
పిచ్ కండిషన్స్ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. హెన్రిచ్ క్లాసెన్ కాస్త ముందుగా పంపించామని, నితీష్ కుమార్ రెడ్డికి ఫినిషర్ రోల్ ఇచ్చినట్లుగా తెలిపాడు. చెపాక్ మైదానంలో తమకు గొప్ప రికార్డులేదన్నాడు. అయినప్పటికి ఆటను ముగించిన తీరు బాగుందన్నాడు. ఏదీఏమైనప్పటికి విజయం సాధించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చినట్లుగా కమిన్స్ తెలిపాడు.