PCB: భారత్‌లో బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ మ్యాచులు ఆడకపోతే ఇలా చేయండి.. మేమున్నాముగా..: పాకిస్థాన్
ప్రపంచకప్ మ్యాచ్‌ల నిర్వహణకు పాకిస్థాన్‌లోని స్టేడియాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని పీసీబీ వర్గాలు చెప్పినట్లు Geo సూపర్ న్యూస్ చెప్పింది.
Mohsin Naqvi (Image Credit To Original Source)
- ఐసీసీకి పాకిస్థాన్ విజ్ఞప్తి
- బంగ్లా ఆడే మ్యాచులను మా దేశంలో నిర్వహించండి
- మా స్టేడియాలు సిద్ధంగా ఉన్నాయి
PCB: టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్‌లో ఆడాల్సిన మ్యాచ్‌ల వేదికలను శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే. భారత్, బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలు దెబ్బతింటున్న వేళ బీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై పాకిస్థాన్ స్పందిస్తూ.. బంగ్లాదేశ్ ఆడాల్సిన మ్యాచులను తమ దేశంలో నిర్వహించాలని ఐసీసీకి విజ్ఞప్తి చేస్తోందని రిపోర్టులు వస్తున్నాయి.
Geo సూపర్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీలంకలో మ్యాచ్‌లు నిర్వహించలేని పరిస్థితి వస్తే బంగ్లాదేశ్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వాలన్న ఆసక్తిని వ్యక్తం చేసింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. పీసీబీ వర్గాలు తమకు ఈ విషయం తెలిపాయని పేర్కొంది. ప్రపంచకప్ మ్యాచ్‌ల నిర్వహణకు పాకిస్థాన్‌లోని స్టేడియాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని పీసీబీ వర్గాలు చెప్పినట్లు Geo సూపర్ న్యూస్ చెప్పింది.
Also Read: ఎవరీ ఆదిత్య అశోక్? న్యూజిలాండ్ జట్టులో ఆడుతున్నాడేంటి? అతడి చేతిపై “నా దారి రహదారి” టాటూ..
గత వారం బీసీసీఐ సలహాతో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను టీమ్ నుంచి రిలీజ్ చేసింది. ఆ నిర్ణయం తీవ్ర వివాదానికి దారి తీసింది.
భద్రతపై ఆందోళనల కారణంగా 2026 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ను కోరాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లకు తమ జట్టును పంపేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆసక్తి చూపడం లేదు.
బంగ్లాదేశ్‌లో వరుసగా హిందూ మైనారిటీలు దాడులు జరుగుతుండడంతో భారత్-బంగ్లా మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇటీవల బంగ్లాదేశ్ ప్రభుత్వ క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ మాట్లాడుతూ.. “మా దేశం క్రికెట్‌ను ప్రాణంగా భావిస్తుంది. మేం తప్పకుండా ఆడాలనుకుంటున్నాం. అయితే మా క్రికెటర్లు, ప్రేక్షకులు, జర్నలిస్టుల భద్రతకు ముప్పు ఉంది. మా దేశ గౌరవం దెబ్బతినే పరిస్థితుల్లో ఇండియాలో ప్రపంచకప్ ఆడాలని మేం కోరుకోవడం లేదు” అని తెలిపారు.
