IND vs AUS : పింక్ బాల్ టెస్టు.. రాణించిన నితీశ్ రెడ్డి.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 180 ఆలౌట్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌటైంది

Pink ball test Team India 180 all out in 1st Innings
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌటైంది. టీమ్ఇండియా బ్యాటర్లలో నితీశ్ రెడ్డి (42; 54 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. కేఎల్ రాహుల్ (37), శుభ్‌మన్ గిల్ (31)లు ఫర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లతో టీమ్ఇండియా పతనాన్ని శాసించాడు. స్కాట్ బొలాండ్, పాట్ కమిన్స్ లు చెరో రెండు వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే.. ఇన్నింగ్స్ తొలి బంతికే టీమ్ఇండియాకు గట్టి షాక్ తగిలింది. గత మ్యాచ్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో భారత్ పరుగుల ఖాతా తెరవకముందే తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతలను భుజాన వేసుకున్నారు.
IND vs AUS : రోహిత్.. ఇది నీకు అవసరమా చెప్పు.. త్యాగం చేశావ్.. ఇప్పుడు చూడు ఏమైందో..
శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడాడు. బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో వైపు రాహుల్ మొదట క్రీజులో కుదురుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఆ తరువాత అతడు బౌండరీలు బాదాడు. ప్రమాదకరంగా మారుతున్న వీరిద్దరి భాగస్వామ్యాన్ని కేఎల్ రాహుల్ ను ఔట్ చేయడం ద్వారా మిచెల్ స్టార్క్ విడగొట్టాడు. గిల్, రాహుల్‌లు రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించాడు.
ఆ తరువాత భారత్ స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కోహ్లీ (7), రోహిత్ శర్మ (3)లతో పాటు గిల్‌లు స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో భారత్ 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశతో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ (22)తో కలిసి రిషబ్ పంత్ (21) లు కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. పంత్, అశ్విన్‌తో పాటు హర్షిత్ రాణా(0)లు స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో భారత్ 141 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.
అయితే.. ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. చివరి వికెట్ గా పెవిలియన్‌కు చేరుకుని జట్టుకు ఓ మోస్తరు స్కోరును అందించాడు.