Shreyas Iyer Net Worth: ఆటలోనే కాదు సంపాదనలోనూ తోపే.. శ్రేయస్ అయ్యర్ ఆస్తి ఎంతో తెలుసా..

అయ్యర్ ఆస్తుల గురించి తెలిస్తే అబ్బురపోవాల్సిందే. అతడి దగ్గర ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి.

Shreyas Iyer Net Worth: ఆటలోనే కాదు సంపాదనలోనూ తోపే.. శ్రేయస్ అయ్యర్ ఆస్తి ఎంతో తెలుసా..

Courtesy BCCI

Updated On : June 3, 2025 / 6:40 PM IST

Shreyas Iyer Net Worth: IPL 2025 చివరి ఘట్టానికి చేరుకుంది. అంతిమ పోరుకు సై అంటున్నాయి. అయితే అందరి దృష్టి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పైనే ఉంది. అయ్యర్ ఇప్పుడు మామూలు ఫామ్ లో లేడు. భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. దీంతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. కేవలం ఆటలోనే కాదు మార్కెటింగ్ లోనూ ఫుల్ ఫేమస్ అయిపోయాడు. భారత క్రికెట్‌లో అత్యంత మార్కెట్ చేయగల ఆటగాళ్ళలో ఒకరిగా మారాడు శ్రేయస్ అయ్యర్. 30 సంవత్సరాల వయస్సులో అటు ఆర్థికపరంగా ఇటు వృత్తిపరంగా అయ్యర్ ప్రాముఖ్యత పెరిగింది.

IPL 2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ మైదానంలో రికార్డులను బద్దలు కొట్టడమే కాదు ఆదాయంలోనూ గణనీయమైన ప్రొగ్రెస్ సాధించాడు. అతడి బ్రాండ్ వ్యాల్యూ ఒక్కసారిగా పెరిగింది. అతడితో ఒప్పందాలకు ప్రముఖ కంపెనీలు క్యూ కడుతున్నాయి. 30 ఏళ్ల ఈ బ్యాటర్.. అటు ఆటలో, ఇటు వాణిజ్యపరంగా తన వ్యాల్యూ పెంచుకుంటూ పోతున్నాడు. ఆటలోనే కాదు సంపాదనపరంగానూ దూసుకుపోతున్నాడు శ్రేయస్ అయ్యర్. ఇప్పుడు అతడి నికర విలువ రూ.65 కోట్లు. IPL కాంట్రాక్టులు, లగ్జరీ పెట్టుబడులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతో ఈ సంపాదన వచ్చింది.

2015లో ఢిల్లీ డేర్‌ డేవిల్స్‌తో రూ.2.6 కోట్లకు తన ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించిన అయ్యర్.. ఆ తర్వాత స్థిరమైన ప్రదర్శనతో అగ్రశ్రేణి క్రికెటర్ గా మారాడు. 2025లో పంజాబ్ కింగ్స్ అతడిని రికార్డ్ స్థాయిలో రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడి ఒప్పందాలలో ఇదొకటి.

1994 డిసెంబర్ 6న ముంబైలో జన్మించిన శ్రేయస్ అయ్యర్ దేశంలో అత్యంత బహుముఖ ప్రజ్ఞాశాలి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. 2021లో టెస్టుల్లోకి ఇంట్రీ ఇచ్చాడు. అరంగేట్రంలోనే సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించి అదరహో అనిపించాడు. తక్కువ సమయంలోనే అన్ని ఫార్మాట్లలో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.

ఐపీఎల్ లో కెప్టెన్ గానూ దుమ్మురేపాడు అయ్యర్. అతడి కెప్టెన్సీలోనే ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్నాయి. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ను ముందుండి మరీ ఫైనల్స్ కు చేర్చాడు. ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ఫైనల్‌కు తీసుకెళ్లిన మొదటి కెప్టెన్ గా అయ్యర్ రికార్డ్ నెలకొల్పాడు. ప్లేఆఫ్స్‌లో ముంబై ఇండియన్స్ పై 87 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఐపీఎల్ నాకౌట్ మ్యాచులలో ఒక కెప్టెన్ చేసిన రెండవ అత్యధిక స్కోర్ ఇదే. టాలెంట్, నాయకత్వ లక్షణాలకు నిలకడ తోడైనప్పుడు అటు మైదానంలో ఇటు బయట దీర్ఘకాలిక విలువను సృష్టిస్తాయని చెప్పడానికి అయ్యరే నిదర్శనం అంటున్నారు.

Also Read: AI జాతకం.. Grok, Gemini, ChatGPT అన్నిటిదీ ఒకటే మాట.. IPL 2025 కొట్టే జట్టు ఇదే..

ఐపీఎల్ లో పెరుగుతూ పోయిన అయ్యర్ విలువ.. ఏ సంవత్సరంలో ఎంత ధర అంటే..
2015-2017 – ఢిల్లీ డేర్ డెవిల్స్ – ఏడాదికి 2.6 కోట్లు
2018-2021 – ఢిల్లీ క్యాపిటల్స్ – ఏడాదికి 7 కోట్లు
2022-2024 – కోల్ కతా నైట్ రైడర్స్ – ఏడాదికి 12.25 కోట్లు
2025 – పంజాబ్ కింగ్స్ – 26.75 కోట్లు

అయ్యర్ BCCI గ్రేడ్ B కాంట్రాక్ట్ జాబితాలో ఉండేవాడు. ఏడాదికి 3 కోట్లు ఆదాయంగా వచ్చేది. అయితే మేనేజ్ మెంట్ తో విభేదాల కారణంగా ఫిబ్రవరి 2024లో అతడి కాంట్రాక్ట్ రద్దు చేయబడింది. అయినప్పటికీ IPL లో తిరుగులేని ఆదాయం పొందాడు. ప్రస్తుతం అతడి ప్రదర్శన పీక్స్ లో ఉంది. దీంతో అయ్యర్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలోకి తిరిగి ప్రవేశించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయ్యర్ ఆస్తులు..
అయ్యర్ ఆస్తుల గురించి తెలిస్తే అబ్బురపోవాల్సిందే. అతడి దగ్గర ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. రూ.3 కోట్ల లంబోర్గిని హురాకాన్, రూ.2.45 కోట్ల ఖరీదు చేసే మెర్సిడెస్-బెంజ్ G63 AMG, ఆడి S5 అతడి దగ్గర ఉన్నాయి. ఇక 2020లో, అతను ముంబైలోని లోధా వరల్డ్ టవర్స్‌లో రూ.11.85 కోట్ల విలువైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు. దాంతో అల్ట్రా-లగ్జరీ ఆస్తులను కలిగున్న భారతీయ క్రీడా ప్రముఖులలో అయ్యర్ ఒకడయ్యాడు.

శ్రేయస్ అయ్యర్ చెల్లెలు శ్రేష్టా అయ్యర్ ప్రొఫెషనల్ డ్యాన్సర్. జంతు సంక్షేమ NGO ‘We Are Pawerful’ వ్యవస్థాపకురాలు కూడా. వారి తల్లిదండ్రులు సంతోష్, రోహిణి అయ్యర్ తమిళం, తుళు మాట్లాడతారు.

నివేదికల ప్రకారం.. అయ్యర్ తన ఆదాయంలో గణనీయమైన వాటాను టెక్, ఫ్యాషన్, పానీయాలు, ఫిన్‌టెక్ రంగాలలోని బ్రాండ్‌లతో ఎండార్స్‌మెంట్ ఒప్పందాల ద్వారా సంపాదిస్తున్నాడు. ఈ ఆఫ్-ఫీల్డ్ ఆదాయాలు 2025 నాటికి అతని అంచనా నికర విలువను రూ. 65 కోట్లకు పెంచడంలో సహాయపడ్డాయి. అయ్యర్ కున్న క్లీజ్ ఇమేజ్, ఆటలో విజయాలు.. అర్బన్, టైర్-2 ప్రేక్షకులకు దగ్గర చేశాయి. అదే అయ్యర్ మార్కెట్ పెరగడానికి దోహదపడింది.