RR vs MI: భారీస్కోరును అలవోకగా.. ముంబైపై రాజస్థాన్ విజయం

  • Published By: vamsi ,Published On : October 26, 2020 / 06:18 AM IST
RR vs MI: భారీస్కోరును అలవోకగా.. ముంబైపై రాజస్థాన్ విజయం

Updated On : October 26, 2020 / 7:16 AM IST

Rajasthan vs Mumbai, 45th Match: ఐపిఎల్ 2020లో 45వ మ్యాచ్‌ రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్‌ మధ్య రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ముంబైపై రాజస్థాన్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. బెన్ స్టోక్స్, సంజు శాంసన్ అజేయ పోరాట ఫలితంగా మ్యాచ్ రాజస్థాన్ పరం అయ్యింది. స్టోక్స్ 60 బంతుల్లో అజేయంగా 107 పరుగులు చేశాడు. అదే సమయంలో సంజు శాంసన్ 31 బంతుల్లో అజేయంగా 54 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 152 పరుగుల భాగస్వామ్యం జట్టుకు అందించారు.



రాజస్థాన్ రాయల్స్ సాధించిన ఈ అద్భుతమైన విజయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ అధికారికంగా ఐపిఎల్ 2020 నుంచి బయటకు వచ్చేసింది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్‌లకు వెళ్లకుండా లీగ్‌ దశలో బయటకు వచ్చేసిన తొలి జట్టు చెన్నై. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్‌కు దిగి పాండ్యా మెరుపులు కారణంగా 196పరుగుల భారీ టార్గెట్ ఇచ్చింది. అయితే రాజస్థాన్ ఆ టార్గెట్‌ను సునాయాశంగా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది. ఇక మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ సెంచరీ చెయ్యగా.. ఇది ఐపీఎల్‌లో అతనికి రెండవది.



రెండో ఓవర్లోనే ఓపెనర్ రాబిన్ ఉతప్ప 13 పరుగులకే అవుట్ అవగా.. తరువాత, కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా ఐదవ ఓవర్లో 44 పరుగులతో 11 పరుగులకు అవుటయ్యాడు. ఉతప్పను, స్మిత్‌ను ప్యాటిన్సన్ అవుట్ చేశాడు. స్మిత్ అయ్యే ముందు ఫోర్, సిక్సర్ కొట్టాడు. 44 పరుగులకు రెండు వికెట్లు పడటంతో బెన్ స్టోక్స్, సంజు శాంసన్ ముంబై బౌలర్లపై దాడి చేశారు. స్టోక్స్ 60 బంతుల్లో 107పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి 14 ఫోర్లు, మూడు సిక్సర్లు వచ్చాయి. అదే సమయంలో సంజు శాంసన్ 31 బంతుల్లో అజేయంగా 54 పరుగులు చేశాడు. అతను నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 152 పరుగుల అజేయ భాగస్వామ్యం జట్టుకు అందించారు.



అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది ముంబై జట్టు. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 195 పరుగులు చేసింది. హార్ధిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఈ స్కోరు సాధ్యం అయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్.. మొదటి ఓవర్లోనే క్వింటన్ డికాక్ వికెట్ కోల్పోయింది. సిక్సర్ కొట్టిన తరువాత డికాక్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రెండో వికెట్‌కు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ 80 పరుగుల భాగస్వామ్యం అందించారు. జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన క్యాచ్ కారణంగా కిషన్ 36బంతుల్లో 37 పరుగులు చేసి అవుటయ్యారు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ మూడో వికెట్ అవుట్ అయ్యాడు. 26 బంతుల్లో 40 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.



సౌరభ్ తివారీ 25బంతుల్లో 34పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో స్టోక్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ పోలార్డ్ ఈ మ్యాచ్‌లో మాత్రం పెద్దగా రాణించలేదు. 4బంతుల్ో ఒక సిక్సర్ మాత్రమే కొట్టి పెవిలియన్ చేరుకున్నాడు. తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా క్రీజులో నిలబడి రాజస్థాన్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. ఈ క్రమంలోనే 21బంతుల్లో 60పరుగులు చేసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ కారణంగా రాజస్థాన్ టార్గెట్ 196పరుగులుగా అయ్యింది. క్రూనాల్ పాండ్యా 4బంతుల్లో 3పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.



రాజస్థాన్ బౌలర్లలో జెఫ్రా ఆర్చర్ తన నాలుగు ఓవర్లలో 31పరుగులు ఇచ్చి 2వికెట్లు తియ్యగా.. అంకిత్ రాజ్‌పూత్ భారీ స్కోరు సమర్పించుకున్నాడు. తన నాలుగు ఓవర్లలో 60పరుగులు ఇచ్చుకున్నాడు. తన చివరి ఓవర్‌లో ఏకంగా 27పరుగులు ఇచ్చుకున్నాడు. కార్తీక్ త్యాగి తన నాలుగు ఓవర్లలో 45పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. శ్రీయాస్ గోపాల్ 2వికెట్లు తీసుకోగా.. రాహుల్ తెవాటియా తన నాలుగు ఓవర్లలో 25పరుగులు ఇచ్చాడు.