Ravichandran Ashwin : ఐపీఎల్ అవార్డులను ఎగతాళి చేసిన అశ్విన్..! ఆ రోజు ఎంతో దూరంలో లేదు..
ఐపీఎల్ అవార్డులు ఇచ్చే విషయంలో కూడా పక్షపాతం కనిపిస్తోందని అంటున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్.

Ravichandran Ashwin Mocks Lop Sided IPL Award Ceremonies
ఐపీఎల్ 2025లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. సీజన్ ప్రారంభమై వారం రోజులైనా కాలేదు ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ వంటి జట్లు 230 కి పైగా పరుగుల స్కోరు సాధించాయి. ఈ క్రమంలో బౌలర్లకు పిచ్‌లు అనుకూలంగా లేవని, టీ20 అంటేనే బ్యాటర్ల గేమ్‌గా మారిపోయిందని పలువురు బౌలర్లతో పాటు మాజీ క్రికెటర్లు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
కేవలం ఈ విషయంలోనే కాదని ఐపీఎల్ అవార్డులు ఇచ్చే విషయంలో కూడా పక్షపాతం కనిపిస్తోందని అంటున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇస్తున్న అవార్డులపై అసంతృప్తిని వెళ్లగక్కాడు.
SRH vs LSG : లక్నోపై సన్‌రైజర్స్ ఓడిపోవడంతో.. కావ్య ఎంతలా బాధపడిందో చూశారా?
‘ఐపీఎల్‌లో ఓ మ్యాచ్ పూర్తి అయిన తరువాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సూపర్ స్ట్రైకర్ అంటూ ఇలా కనీసం 10 అవార్డులైనా ఇస్తారు. ఓడినా, గెలిచిన జట్లు ఈ అవార్డుల్లో దాదాపు 50 శాతం ఏదో ఒక రకమైన అవార్డులను అందుకుంటాయి. అయితే.. ఎవరైతే బాగా బౌలింగ్ చేస్తారో, మంచి ఓవర్ వేస్తారో వారికి మాత్రం ఒక్క అవార్డు రాదని. అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.
‘సూపర్ స్ట్రైకర్, సూపర్ ఫోర్లు, సూపర్ సిక్సర్లు వంటి అవార్డులు ఉన్నాయి. అయితే.. సూపర్ బాల్ అనే అవార్డు లేదు. ఒకప్పుడు ఫాస్టెస్ట్ బాల్ అవార్డు ఉండేది. ఆ బంతి సిక్స్‌గా వెళ్లినా అవార్డు ఇచ్చేవారు.’ అని అశ్విన్ అన్నాడు.
ఇలాగే అవార్డు ఇస్తూ పోతే.. బౌలర్ బంతితో గ్రౌండ్‌ను వదలిపారిపోయే సమయం ఎంతో దూరంలో లేదన్నాడు. నిజం చెప్పాలంటే ఒక బౌలర్ బంతిని వేయకపోతే బ్యాటర్ ఎలా కొట్టగలడు అంటూ అశ్విన్ ప్రశ్నించాడు.
విజయ్‌కుమార్ వైశాక్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాల్సింది
ఐపీఎల్ 2025లో పంజాబ్‌కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌పై ఇటీవల రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. ఆ మ్యాచ్‌లో విజయ్‌కుమార్ వైశాక్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. ఆ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన వైశాక్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మ్యాచ్ చివరి ఐదారు ఓవర్ల ముందు మైదానంలో అడుగుపెట్టిన అతడు చక్కని ప్రదర్శన చేశాడు.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 243 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ చక్కగా ఆడుతోంది. 14 ఓవర్లు ముగిసే సరికి 169/2 స్కోరుతో లక్ష్యం దిశగా పయనిస్తోంది. ఈ దశలో వైశాక్ బౌలింగ్‌కు వచ్చాడు. తన తొలి ఓవర్‌లో ఐదు పరుగులు మాత్రమే ఇచ్చిన అతడు రెండో ఓవర్‌ను మరో ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో గుజరాత్ 17 ఓవర్లు ముగిసే సరికి 187/2 తో నిలిచింది.
గుజరాత్ సాధించాల్సిన రన్‌రేట్ అమాంతం పెరిగిపోయింది. కాగా.. తన మూడో ఓవర్‌లో వైశాక్ 18 పరుగులు ఇచ్చాడు. చివరి ఓవర్‌లో గుజరాత్ 6 బంతుల్లో 27 పరుగులు చేయడంతో విఫలమైంది. దీంతో పంజాబ్ గెలిచింది. ఏదీఏమైనప్పటికి ఈ మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన శ్రేయస్ అయ్యర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
వికెట్లు తీయనప్పటికి వరుసగా రెండు ఓవర్లలో కేవలం ఐదేసి చొప్పున పరుగులు ఇచ్చి గుజరాత్ అవకాశాలను దెబ్బతీసిన వైశాక్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది. మ్యాచ్ చివరి ఐదారు ఓవర్ల ముందు మైదానంలో అడుగుపెట్టిన ఆటగాడు వైడ్ యార్కర్లను చక్కగా వేయడం అంత సులభం కాదని గుజరాత్ కెప్టెన్ గిల్ సైతం వైశాక్‌ను అభినందించాడంలే.. అతడు ఎంతటి చక్కటి ప్రదర్శన చేశాడో చెప్పవచ్చు. దీనిపైనే అశ్విన్ మాట్లాడుతూ.. వైశాక్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చిఉండాల్సింది అని చెప్పాడు.