దుమ్ము దులిపారు: కివీస్‌ను ఉతికారేసిన రాయుడు, టార్గెట్ 253

న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ పంజా విసిరారు. టాపార్డర్ కుదేలైన వేళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అంబటిరాయుడు క్రీజులో పాతుకుపోయి జట్టుకు మంచి స్కోరు అందించాడు. రాయుడితో పాటుగా విజయ్ శంకర్, పాండ్యాలు వీర బాదుడుతో కివీస్‌కు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్.. ఇన్నింగ్స్‌కు శుభారంభాన్ని అందించలేకపోయాడు. అతనితో పాటు మరో ఓపెనర్ ధావన్ సైతం విఫలమవడంతో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది.
ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన హెన్రీ బౌలింగ్‌లో రోహిత్ శర్మ (2) క్లీన్ బౌల్డవగా.. ఆ తర్వాత ఓవర్‌లో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో అప్పర్ కట్ ఆడిన ధావన్ (6) బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ మాట్ హెన్రీ చేతికి చిక్కాడు. అనంతరం నిలకడగా ఆడినట్లు కనిపించిన శుభమన్ గిల్ (7) కూడా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఫెయిలైయ్యాడు. హెన్రీ బౌలింగ్‌లో పేలవ ఫుట్‌వర్క్ కారణంగా ఫీల్డర్ శాంట్నర్ చేతికి చిక్కాడు. ఈ దశలో జట్టుని ఆదుకుంటాడని ఆశించిన మాజీ కెప్టెన్ ధోని కేవలం ఒక్క పరుగు మాత్రమే తీసి బౌల్ట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు.
దీంతో.. 9.3 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 18/4తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన అంబటి రాయుడు మ్యాచ్‌ను నడిపించాడు. 113 బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సులతో చెలరేగి 90 పరుగులు చేశాడు. రాయుడు దూకుడుకు విజయ్ శంకర్ చక్కటి భాగస్వామ్యం అందించడంతో భారత్ ఊపిరిపీల్చుకుంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్(34)పరుగులు చేయగలిగాడు.
ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మాత్రం కివీస్‌పై రెచ్చిపోయాడు. ఆఖరి ఓవర్లలో బ్యాటింగ్‌కు దిగిన పాండ్యా 22 బంతుల్లో 2 ఫోర్లు, 5సిక్సులతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇంకా ఒక బంతి మిగిలుండగానే భారత్ 10 వికెట్లు నష్టపోయి 252 పరుగులు మాత్రమే చేయగలిగింది.