పంత్.. కార్తీక్‌లలో వరల్డ్ కప్ జట్టుకు ఎవరు..

ఐపీఎల్ ఆరంభమై సగానికి వచ్చేసింది కూడా. ఆ తర్వాత ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ టోర్నీకి భారత్ సిద్ధమవ్వాల్సి ఉంది. కానీ, ఇప్పటికీ 4వ స్థానంలో ఎవరు సరిపోతారనే విషయంతో పాటు, రెండో వికెట్ కీపర్‌గా ఎవర్ని తీసుకోవాలనే చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలో సెలక్షన్ కమిటీ ముంబై వేదికగా ఏప్రిల్ 15న మరోసారి సమావేశం కానుంది. రిషబ్ పంత్.. దినేశ్ కార్తీక్ ఇద్దరు వికెట్ కీపర్లే. మహేంద్ర సింగ్ ధోనీ ఉంటే కీపర్ గురించి ఆలోచనే అవసర్లేదు. కానీ, మహీ అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నయం ఉండాలి కదా. అందుకోసం రెండో వికెట్ కీపర్ కోసం చర్చలు జరిపేందుకు సిద్ధమైంది సెలక్షన్ కమిటీ.
‘భారత్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ అనంతరం ఆటగాళ్ల ఫిట్‌నెస్, ఫామ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని జట్టు ఎంపిక చేపడుతున్నాం. ఐపీఎల్ ఆడుతున్న వారి ఫిట్‌నెస్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాం. రెండో కీపర్‌గా పంత్.. కార్తీక్ లలో ఎవర్నో ఒకరినే ఎంచుకోవలసిన పరిస్థితి. నాలుగో స్థానానికి అంబటి రాయుడుతో పాటు విజయ్ శంకర్ కూడా కాంపిటీషన్ ఇస్తున్నాడు. ఇక ఆల్ రౌండర్ స్థానంలో రవీంద్ర జడేజా.. హార్దిక్ పాండ్యాలు కనిపిస్తున్నారు’ అని బీసీసీఐ అధికారి మీడియా సమావేశంలో తెలిపారు.
ఇప్పటి వరకూ ఫామ్‌లో ఉన్న ప్లేయర్లను బట్టి చూస్తే వరల్డ్ కప్ 15 మంది ప్లేయర్ల టీం ఇలా కనిపిస్తోంది.
14 మంది ప్లేయర్లు:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మహేంద్ర సింగ్ ధోనీ(వికెట్ కీపర్), కేదర్ జాదవ్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, షమీ, రవీంద్ర జడేజా
మిగిలిన ఆ ఒక్క స్థానానికి;
రెండో వికెట్ కీపర్‌గా తీసుకుంటే– దినేశ్ కార్తీక్.. రిషబ్ పంత్
స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ కావాలంటే– అంబటి రాయుడు
నాల్గో ఫేసర్‌గా– ఉమేశ్ యాదవ్.. ఖలీల్ అహ్మద్.. ఇషాంత్ శర్మ.. నవదీప్ షైనీ