Rohit Sharma : శనివారం నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం.. భారీ రికార్డు పై రోహిత్ శర్మ కన్ను.. ఇంకో 72..
రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డు పై కన్నేశాడు.

Rohit Sharma 72 Runs Away From Becoming second Player To Reach This Milestone
భారత్, పాక్ ఉద్రిక్తత కారణంగా వారం పాటు వాయిదా పడిన ఐపీఎల్ 2025 సీజన్ శనివారం ( మే17) నుంచి పునఃప్రారంభం కానుంది. ఈ క్రమంలో అందరి దృష్టి ఇప్పుడు ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ పైనే ఉంది. ఇటీవలే టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన హిట్‌మ్యాన్ మిగిలిన మ్యాచ్‌లో ఎలా ఆడతాడో అన్న ఆసక్తి నెలకొంది.
కాగా.. రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డు పై కన్నేశాడు. ఐపీఎల్‌లో హిట్‌మ్యాన్ మరో 72 పరుగులు చేస్తే 7వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో 7 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న రెండో ఆటగాడిగా రికార్డులకు ఎక్కుతాడు. విరాట్ కోహ్లీ మాత్రమే ఈ ఘనత సాధించాడు.
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ 268 మ్యాచ్‌లు ఆడాడు. 29.7 సగటు 131.9 స్ట్రైక్‌రేటుతో 6928 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 46 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఐపీఎల్ ఆరంభం నుంచి రోహిత్ శర్మ ఆడుతున్నాడు. అతడి ప్రయాణం డెక్కన్ ఛార్జర్స్‌తో ప్రారంభమైంది. 2008 నుంచి 2010 వరకు డెక్కన్ తరుపున 45 మ్యాచ్‌లు ఆడాడు. 44 ఇన్నింగ్స్‌ల్లో 30.79 సగటు 131 కంటే ఎక్కువ స్ట్రైక్‌రేటుతో 1170 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆ తరువాత 2011 మెగావేలంలో అతడిని ముంబై కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ముంబై తరుపుననే ఆడుతున్నాడు.
IPL 2025 : మరో రెండు రోజుల్లో ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్‌సీబీకీ లడ్డూలాంటి న్యూస్..
ఇక ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ 263 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 39.6 సగటుతో 132.6 స్ట్రైక్‌రేటుతో 8509 పరుగులు చేశాడు.