IPL 2025 : మరో రెండు రోజుల్లో ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్‌సీబీకీ లడ్డూలాంటి న్యూస్..
మరో రెండు రోజుల్లో ఐపీఎల్ పునఃప్రారంభం కానున్న తరుణంలో ఆర్‌సీబీకి శుభవార్త అందింది.

Courtesy BCCI
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షగానే ఉంది. 17 ఏళ్లుగా టైటిల్ కోసం ఆర్‌సీబీ నిరీక్షిస్తోంది. కాగా.. ఐపీఎల్ 18వ సీజన్‌లో ఆర్‌సీబీ అదరగొడుతోంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 16 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉండగా నెట్‌రన్‌రేట్ +0.482గా ఉంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. లీగ్ దశలో ఇంకో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో ఒక్క మ్యాచ్‌లో గెలిచినా కూడా ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతోంది.
అయితే.. భారత్, పాక్ ఉద్రికత్తల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ వారం పాటు వాయిదా పడగా.. శనివారం (మే 17) నుంచి పునఃప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆర్‌సీబీకి ఓ శుభవార్త అందింది. ఐపీఎల్ వాయిదా పడడంతో స్వదేశానికి వెళ్లిపోయిన ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ మళ్లీ ఐపీఎల్ ఆడేందుకు భారత్ కు వస్తున్నాడని సమాచారం.
అతడు ఖచ్చితంగా ఏ తేదీన వస్తాడు అన్న విషయం తెలియనప్పటికి త్వరలోనే అతడు భారత్ రానున్నట్లు హేజిల్‌వుడ్ సన్నిహితులు వెల్లడించినట్లు హిందూస్తాన్ టైమ్స్ తెలిపింది.
కాగా.. ఆర్‌సీబీ ఆడిన చివరి మ్యాచ్‌లో హేజిల్‌వుడ్ ఆడలేదు. అతడి భుజానికి గాయమైనట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో జూన్ 11 నుంచి 15 వరకు ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో తలపడే ఆస్ట్రేలియా జట్టులో హేజిల్‌వుడ్ కు చోటు దక్కింది. దీంతో అతడు ఐపీఎల్‌లోని మిగిలిన మ్యాచ్‌లు ఆడడం పై అనిశ్చితి నెలకొంది.
ఇక ఇప్పుడు ఐపీఎల్‌లో ఆడేందుకు హేజిల్‌వుడ్ వస్తున్నాడు అనే వార్తతో అనుమానాలు అన్నీ తీరిపోయాయి. హేజిల్‌వుడ్ రాక ఆర్‌సీబీకి ఎంతో మేలు చేస్తుంది. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన హేజిల్‌వుడ్ 18 వికెట్లు పడగొట్టి ఆర్‌సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.