సిడ్నీలో ఇరగదీశాడు : రోహిత్ శర్మ అద్బుత సెంచరీ

ఇండియా – ఆస్ట్రేలియా సిడ్నీ వన్డే లో రోహిత్ శర్మ ఇరగదీశాడు. మ్యాచ్ క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆదుకున్నాడు. 133 బంతుల్లోనే 129 పరుగులు చేశాడు. సెంచరీ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ ఆసీస్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. 103 స్ట్రయిక్ రేట్ తో.. వీర విహారం చేశాడు. ఫోర్లు 10 కొడితే.. సిక్సులు ఏకంగా 6 కొట్లాడు. మిగతావి అన్నీ సింగిల్స్, డబుల్స్. సిక్సులతో గ్రౌండ్ మార్మోగింది. తన పరుగులతో స్కోర్ బోర్డ్ ను పరిగెత్తించాడు. అన్ని వైపులకు బంతిని కొడుతూ తన సత్తా చూపించాడు రోహిత్.
క్లిష్ట సమయంలో నిలబడ్డాడు :
రోహిత్ శర్మ చాలా క్లిష్ట సమయంలో ఆదుకున్నాడు. ఓపెనర్ గా దిగినా.. నిలకడగా పరుగులు రాబడుతున్నాడు. శిఖర్ ధావన్ డకౌట్ అయినా.. కెప్టెన్ విరాట్ అలా వచ్చి ఇలా వెళ్లినా.. ఆ తర్వాత వచ్చిన అంబటి రాయుడు సైతం డకౌట్ అయినా ఏ మాత్రం ఏకాగ్రత కోల్పోలేదు. ధోనీతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. రోహిత్ – ధోనీ కాంబినేషన్ లో నిలకడగా ఆడుతున్న సమయంలోనే ధోనీ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత కూడా నిలకడగా రాణిస్తూ.. సెంచరీ పూర్తి చేశాడు రోహిత్ శర్మ.