గంగూలీ సంచలన వ్యాఖ్యలు.. నేటి ఫైనల్ మ్యాచులో ఓడిపోతే.. రోహిత్ శర్మ సముద్రంలో దూకేస్తాడు..
టీ20 ప్రపంచకప్‌లో ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది.

Rohit Sharma Will Probably Jump Into Barbados Ocean says Sourav Ganguly
Sourav Ganguly: టీ20 ప్రపంచకప్‌లో ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. నేడు (శనివారం జూన్ 29)న భారత్, దక్షిణాఫ్రికా జట్లు బార్బడోస్ వేదికగా ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ పొట్టి ప్రపంచకప్‌లో రెండు జట్లు కూడా ఒక్క మ్యాచులోనూ ఓడిపోకుండా ఫైనల్‌కు చేరుకున్నాయి. దీంతో ఫైనల్‌లో రెండు జట్లు కప్పు కోసం హోరాహోరీగా పోటీపడడం ఖాయం. అప్పుడెప్పుడో 2007లో తొలి టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచింది. దీంతో మరోసారి విశ్వవిజేతగా నిలవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు లేకలేక వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని దక్షిణాఫ్రికా భావిస్తోంది. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నేటి మ్యాచ్‌లో గనుక టీమ్ఇండియా ఓడిపోతే మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మ బాధతో బార్బడోస్ సముద్రంలో దూకేస్తాడని గంగూలీ అన్నాడు. అయితే.. పొట్టి ప్రపంచకప్ గెలవాలంటే కాస్త అదృష్టం కూడా కలిసి రావాలన్నాడు. గత ఏడు నెలల్లో కెప్టెన్‌గా రోహిత్ కు ఇది రెండో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కావడం గమనార్హం.
IND vs SA Final : ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? తాజా వివరాలు ఇక్కడ చూడండి ..
స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. అయితే.. ఆఖరి మెట్టు పై బోల్తా పడింది. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆ బాధను కాస్త దిగమింగి మరో టోర్నీలో అడుగుపెట్టిన భారత్.. టీ20 ప్రపంచకప్‌లోనూ వరుస విజయాలతో ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు ఫైనల్ మ్యాచులో సఫారీల చేతిలో ఓడిపోతే మాత్రం ఆవేదనతో రోహిత్ శర్మకు సముద్రంలో దూకేయాలనే ఆలోచన రావొచ్చునని గంగూలీ చెప్పాడు.
అయితే.. టీమ్ఇండియా ఓడిపోయే ఛాన్సే లేదన్నాడు. తప్పక గెలుస్తుందనే ధీమాను దాదా వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ టీమ్ఇండియాను అద్భుతంగా నడిపిస్తున్నాడు. అతడు సైతం గొప్పగా బ్యాటింగ్ చేస్తున్నాడని, ఫైనల్‌లోనూ అదే జోరు కొనసాగిస్తాడని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ప్లేయర్లు స్వేచ్ఛగా ఆడాలని సూచించాడు. భారత్‌కు కాస్త అదృష్టం కూడా ఉండాలని కోరుకుంటున్నా అని గంగూలీ అన్నాడు.
Also Read : డగౌట్‌లో కదలకుండా కూర్చొన్న కోహ్లి.. కోచ్ ద్రవిడ్ ఏం చేశాడంటే..?