సచిన్-సెహ్వాగ్‌లు ఆడితే.. బౌండరీల వర్షం కురియదా

సచిన్-సెహ్వాగ్‌లు ఆడితే.. బౌండరీల వర్షం కురియదా

Updated On : March 8, 2020 / 12:24 PM IST

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్.. టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్‌ల జోడీ క్రీజులో దిగితే ఎన్నేళ్లైనా ఒకటే. మరోసారి నిరూపించింది ఆ జోడీ. శనివారం వాంఖడే స్టేడియం వేదికగా రోడ్ భద్రతపై అవగాహన కోసం ఆడిన మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ తరపున ఆడి జట్టును గెలిపించారు. జహీర్ ఖాన్ యార్కర్, యువరాజ్ సింగ్ బాదుడు మ్యాచ్‌కు హైలెట్స్. 

టెండూల్కర్, బ్రియాన్ లారా కెప్టెన్లుగా జరిగిన మ్యాచ్‌లో సచిన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. శివ్‌నరైన్ చందర్‌పాల్ పాత బ్యాటింగ్ స్టాన్స్‌తో స్టేడియంలో అభిమానులను హోరెత్తించాడు. 41బంతుల్లో 61పరుగులు 6బౌండరీలు చెలరేగిపోయాడు. 20ఓవర్లు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 8వికెట్ల నష్టానికి 150పరుగులు చేసింది. జహీర్ ఖాన్ స్టన్నింగ్ క్యాచ్‌తో ఫీల్డింగ్‌లో అదరగొట్టాడు. 

భారత బ్యాటింగ్‌లో మాజీ స్టార్లు రెచ్చిపోయారు. సచిన్-సెహ్వాగ్‌ల జోడీ ఊపందుకోవడంతో గేమ్ తిరిగిపోయింది. వెస్టిండీస్ బౌలర్ పెడ్రో కొలిన్స్ వేసిన తొలి బంతిని బౌండరీకి పంపిన సెహ్వాగ్ అదే దూకుడు కొనసాగించాడు. పాత రోజులు గుర్తు చేసిన వీరూ.. సచిన్ కు చక్కటి భాగస్వామ్యం అందించడంతో ఇండియా లెజెండ్స్ జట్టు విజయం అందుకుంది. 

స్టేడియంలో సచిన్-సెహ్వాగ్‌లు పరుగుల మధ్య క్రీజులో కదులుతుంటే వాంఖడే వేదికగా 2011వరల్డ్ కప్ మ్యాచ్ గుర్తొచ్చింది. 29బంతులకు 36పరుగులు చేశాడు సచిన్. మైదానమంతా సచిన్.. సచిన్ అంటూ హోరెత్తారు అభిమానులు. ఢిల్లీ హిట్టర్ సెహ్వాగ్.. 57బంతుల్లో 74పరుగులు చేసి జట్టు 7వికెట్ల తేడాతో గెలిచేలా చేశాడు.