టెస్టులకు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన వేళ.. హృదయం ద్రవింపజేసే సంఘటన గురించి చెప్పిన సచిన్ టెండూల్కర్
తన మనసులో ఆ సంఘటన చిరస్థాయిగా నిలిచిపోతుందని సచిన్ తెలిపారు.

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ యువ క్రికెటర్లకు స్ఫూర్తినిచ్చాడంటూ టీమిండియా మాజీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
దీనిపై సచిన్ స్పందిస్తూ హృదయం ద్రవింపజేసే ఓ సంఘటన గురించి చెప్పారు. కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన వేళ తనకు ఓ సంఘటన గుర్తుకొచ్చిందని అన్నారు. 12 ఏళ్ల క్రితం తాను తన కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతున్న సమయంలో కోహ్లీ తనకు ఓ దారాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించాడని అన్నారు.
అది కోహ్లీకి ఆయన దివంగత తండ్రి ఇచ్చిన దారమని సచిన్ వివరించారు. ఆ దారం కోహ్లీకి వ్యక్తిగతమైనదని, అందుకే దాన్ని తీసుకోలేకపోయానని అన్నారు. కోహ్లీ ఆ దారాన్ని ఇవ్వాలని అనుకోవడం తన హృదయాన్ని హత్తుకుందని చెప్పారు.
Also Read: తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? టాప్ నోకియా స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..
తన మనసులో ఆ సంఘటన చిరస్థాయిగా నిలిచిపోతుందని సచిన్ తెలిపారు. తాను మాత్రం కోహ్లీకి అటువంటి దారాన్ని ఇవ్వలేనని, దయచేసి తన అభిమానం, అభినందనలను స్వీకరించాలని అన్నారు. చాలా మంది యంగ్ క్రికెటర్లకు కోహ్లీ స్ఫూర్తినిచ్చాడని చెప్పారు.
కోహ్లీ కెరీర్ అద్భుతమని సచిన్ అన్నారు. ఇండియన్ క్రికెట్‌కు కోహ్లీ ఎంతో సేవ చేశాడని కొనియాడారు. కాగా, కోహ్లీ భారత క్రికెట్‌కు అందించిన సేవలను చాలా మంది క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు కొనియాడుతున్నారు. కోహ్లీ వంటి బ్యాటర్ టీమిండియాకు మళ్లీ దొరకాలంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.