Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ వివాదం వేళ విరాట్ కోహ్లీపై అక్తర్ వివాదాస్పద వ్యాఖలు

పాకిస్థాన్ కు చెందిన ఓ టెలివిజన్ షోలో పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ లో ఆడటానికి భారత జట్టు ..

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ వివాదం వేళ విరాట్ కోహ్లీపై అక్తర్ వివాదాస్పద వ్యాఖలు

Shoaib Akhtar

Updated On : December 5, 2024 / 7:50 AM IST

Champions Trophy Controversy: ఛాంపియన్స్ ట్రోఫీ వివాదం కొనసాగుతూనే ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిధ్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే, భారత్ జట్టు పాకిస్థాన్ లో ఆడేందుకు ఒప్పుకోలేదు. తటస్థ వేదికల్లో ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటామని చెప్పింది. తొలుత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అందుకు ఒప్పుకోలేదు. ఐసీసీ రంగంలోకి దిగడంతో హైబ్రిడ్ మోడల్ పద్దతిలో భారత్ జట్టు టోర్నీలో పాల్గొనేందుకు పీసీబీ అంగీకరించింది. ఈ క్రమంలో రెండు షరతులు పెట్టింది. భారత్ వేదికగా జరిగే టోర్నీల్లో తాము కూడా హైబ్రిడ్ మోడల్ పద్దతిలో ఆడేందుకు అవకాశం ఇవ్వాలని, ఐసీసీ నుంచి ఆర్థిక ప్రోత్సాహకాలను కూడా పెంచాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ పై సందిగ్దత నెలకొంది. ఇదే సమయంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా.. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: IND vs AUS : ఆసీస్‌తో రెండో టెస్టుకు ముందు టీమ్ఇండియా మేనేజ్‌మెంట్‌ కీల‌క నిర్ణ‌యం.. ఇక పై..

పాకిస్థాన్ కు చెందిన ఓ టెలివిజన్ షోలో అక్తర్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ లో ఆడటానికి భారత జట్టు తహతహలాడుతోంది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బహుశా పాకిస్థాన్ లో ఆడటానికి ఉత్సాహంగా ఉంటాడు. ఒకవేళ భారత్ పాకిస్థాన్ లో ఛాంపియన్స్ ట్రోపీ ఆడటానికి వస్తే వారి టీవీ హక్కులు, స్పాన్సర్ల ధరలుసైతం ఆకాశాన్ని అంటుతాయని అన్నారు. ఈ చర్చలో పాక్ మాజీ ఆటగాడు మహ్మద్ హఫీజ్ కూడా పాల్గొన్నారు. షోయబ్ వ్యాఖ్యలకు స్పందిస్తూ.. అలా అయితే ఎందుకు భారత్ జట్టు పాకిస్థాన్ కు రావడం లేదని ప్రశ్నించాడు. దీని అక్తర్ స్పందిస్తూ భారత్ ప్రభుత్వానికి ఇది అక్కర్లేదు అంటూ సమాధానమిచ్చాడు. అక్తర్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారత్ జట్టు అభిమానులు మండిపడుతున్నారు.