GT vs PBKS : గుజరాత్ టైటాన్స్ పై విజయం తరువాత.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు..
గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించడానికి గల కారణాలను పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించారు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. మంగళవారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ (97 నాటౌట్; 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లు), శశాంక్ సింగ్ (44 నాటౌట్; 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), ప్రియాంష్ ఆర్య (47; 23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు.
అనంతరం సాయి సుదర్శన్ (74; 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు), జోస్ బట్లర్ (54; 33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), షెఫానీ రూథర్‌ఫర్డ్ (46; 28 బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్సర్లు) రాణించినప్పటికి గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగులకే పరిమితం అయింది.
ఇక మ్యాచ్ అనంతరం తమ జట్టు గెలవడానికి గల కారణాలను పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే తాను 97 పరుగులతో అజేయంగా నిలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఫోర్ కొట్టడంతో ఆత్మవిశ్వాసం వచ్చిందన్నాడు. రబాడ బౌలింగ్‌లో ప్లిక్ షాట్‌తో సిక్స్ బాదడం ఎంతో ప్రత్యేకం అన్నాడు. ఇక ఆఖరిలో శశాంత్ 16 -17 బంతుల్లో చేసిన 44 పరుగులు కీలకంగా మారాయన్నాడు. మా ఆటగాళ్లు అంతా దూకుడు చూపించాల్సిందే అన్న బెంచ్ మార్క్‌ను సెట్ చేసుకున్నట్లుగా వెల్లడించాడు.
అర్ష్‌దీప్ సింగ్ మా ట్రంప్ కార్డ్..
ఇక బౌలర్ వైశాక్ పై శ్రేయస్ అయ్యర్ ప్రశంసల జల్లు కురించాడు. అతడు చాలా సరదా స్వభావం ఉన్న వ్యక్తి అని, చాలా స్పష్టమైన ఆలోచనలతో గ్రౌండ్‌లోకి వస్తాడన్నారు. ప్రశాంతంగా ఉంటూ తన పనిని తాను చేసుకుంటాడు. తొలి బంతి నుంచే యార్కర్లు వేయడం మొదలుపెడతాడన్నాడు.
ఇక అర్ష్‌దీప్ సింగ్ విషయానికి వస్తే.. వైడ్ యార్కర్ ప్లాన్‌లో అతడే మా ట్రంప్ కార్డు. అతడు వచ్చి బంతి కాస్త రివర్స్ స్వింగ్ అవుతోందని చెప్పాడు. బంతి పై లాలాజలం రుద్దడం బౌలర్లకు కాస్త సహయపడుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. అతడు సాయి సుదర్శన్‌ను ఔట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తరువాత అతడు వచ్చి వైడ్ యార్కర్ల ప్లాన్ ఆఖరిలో కాకుండా కాస్త ముందుగానే అమల్లో పెడుదాం అని అని చెప్పినట్టుగా శ్రేయస్ వెల్లడించాడు.
ఇక ఈ సీజన్ కోసం తాము అన్ని విధాలుగా సిద్ధం అయినట్లు శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. మైదానంలో ఏం చేయాలనే దానిపై ముందుగానే జట్టు సమావేశాల్లో చర్చించుకున్నాం. తాను మాత్రమే కాదని, అందరూ తమ ప్రణాళికలను చాలా చక్కగా అమలు చేశారన్నాడు. ఇక మిగిలిన మ్యాచ్‌ల్లో అదే జోరును కొనసాగించాలని చూస్తున్నట్లుగా శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.