Shreyas Iyer : అయ్యర్‌కు చావో రేవో.. ఇలాగైతే స్థానం గల్లంతే..!
వన్డే ప్రపంచకప్ ముందు వరుస విజయాలతో భారత జట్టు మంచి జోష్‌లో ఉంది. జట్టు కూర్పు విషయంలో దాదాపుగా ఓ స్పష్టత వచ్చింది. అయితే.. ఇప్పుడు భారత అభిమానులను ఓ విషయం కలవరపెడుతోంది.

Shreyas Iyer
Shreyas Iyer fails continues : వన్డే ప్రపంచకప్ (ODI World Cup) ముందు వరుస విజయాలతో భారత జట్టు మంచి జోష్‌లో ఉంది. జట్టు కూర్పు విషయంలో దాదాపుగా ఓ స్పష్టత వచ్చింది. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కూడా వన్డేల్లో ఫామ్ అందుకోవడం శుభపరిణామంగా చెప్పవచ్చు. అయితే.. ఇప్పుడు భారత అభిమానులను ఓ విషయం కలవరపెడుతోంది. అదే శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఫామ్. రీ ఎంట్రీలో అయ్యర్ ఒక్క మ్యాచులో కూడా రాణించలేదు. ఇక అతడి ఫిట్నెస్ పై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో అయ్యర్‌ను జట్టు నుంచి తప్పించాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
వెన్నునొప్పి కారణంగా కొన్ని నెలల పాటు ఆటకు దూరం అయిన అయ్యర్ ఆసియాకప్ 2023తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే.. రెండు మ్యాచులు ఆడాడో లేదో మళ్లీ గాయం బారిన పడి కీలక మ్యాచులకు దూరం అయ్యాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు మళ్లీ అందుబాటులోకి వచ్చాడు. తొలి వన్డేలో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి రనౌట్ అయ్యాడు. కాగా.. రీ ఎంట్రీలో ఒక్క మ్యాచులో కూడా అయ్యర్ మంచి ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అటు ఫీల్డింగ్‌లో సైతం ఇబ్బందులు పడుతున్నాడు. పలు క్యాచులను మిస్ చేశాడు.
కేఎల్ రాహుల్ నాలుగో స్థానంలో ఆడుతూ అదరగొడుతున్నాడు. ఐదో స్థానంలో ఇషాన్ కిషన్ బాగానే ఆడుతున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అయ్యర్ పై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్ అతడికి మరో రెండు అవకాశాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఆసీస్‌తో జరగనున్న రెండు, మూడో వన్డే మ్యాచుల్లో సైతం అయ్యర్ రాణించకపోతే వన్డే ప్రపంచకప్‌పై అతడు ఆశలు వదులుకోవాల్సిందేనని క్రీడాపండితులు అంటున్నారు.
ఇక అభిమానులు సైతం అయ్యర్ వద్దని అంటున్నారు. ప్రపంచకప్ ముందు ఇలాంటి ప్రయోగాలు అవసరం లేదని, అయ్యర్ ను జట్టు నుంచి తప్పించాలని అంటున్నారు. మరీ ప్రస్తుత పరిస్థితుల్లో అయ్యర్ జట్టులో తన స్థానాన్ని నిలుపుకోగలడా అన్నది ప్రశ్నగా మారింది. చూడాలి మరీ మిగిలిన వన్డేల్లో అయ్యర్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో.