India vs Zimbabwe : తొలిసారి ఇలా జరగడం ఆనందంగా ఉంది.. వారిద్దరి వల్లనే ఇదంతా.. శ్రేయాస్ అయ్యర్ కీలక కామెంట్స్..
India vs Zimbabwe Shreyas Iyer : మ్యాచ్ విజయం అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ.. భారత జట్టు కెప్టెన్‌గా తొలి టీ20 సిరీస్ విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని అయ్యర్ చెప్పుకొచ్చాడు.
India defeated Zimbabwe team in 2nd T20 match
- రెండో టీ20లో జింబాబ్వేపై భారత్ విజయం
- 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్
- నేడు మూడో టీ20 మ్యాచ్
India vs Zimbabwe Shreyas Iyer : జింబాబ్వే పర్యటనలో భాగంగా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. శనివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుతంగా రాణించారు.
Also Read : India vs Zimbabwe: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. టీ20 సిరీస్ కైవసం
రెండో టీ20 మ్యాచ్‌లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇషాన్ కిషన్ (81; 44 బంతుల్లో) మెరుపు అర్ధశతకంతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించగా, తిలక్ వర్మ (60నాటౌట్) ఆఖరి వరకు వేగంగా పరుగులు సాధించాడు. వైభవ్ సూర్యవంశీ (20), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25) తమవంతు సహకారం అందించారు. 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే భారత బౌలర్ల ధాటికి 17.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. బ్రయాన్ బెనెట్ (32) మినహా ఎవరూ రాణించలేకపోయారు. భారత బౌలర్లలో అభిషేక్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు సాధించారు.
మ్యాచ్ విజయం అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ.. భారత జట్టు కెప్టెన్‌గా తొలి టీ20 సిరీస్ విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని అయ్యర్ చెప్పుకొచ్చాడు. తొలుత బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ అసాధారణ ప్రదర్శన కనబర్చారు. వారిద్దరూ ఆడిన కొన్ని షాట్లు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్నాయి. ఈ పిచ్ పై తొలుత 180 నుంచి 200 పరుగులు చేస్తే మంచి స్కోర్ అని మేము భావించాం. కానీ, తిలక్, ఇషాన్ అద్భుత ఇన్నింగ్స్ వల్ల 219 భారీ పరుగులు చేయగలిగాం.
బౌలర్లు సైతం అద్భుతంగా రాణించారు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్టును 129 పరుగులకే కట్టడి చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే అతిథ్య జట్టుపై ఆధిపత్యం చెలాయించాం. టీ20 ఫార్మాట్లో భయం, బెరుకు లేకుండా క్రికెట్ ఆడటం చాలా ముఖ్యం. గతంలో ఏం జరిగిందనేది పక్కన పెట్టి.. ప్రస్తుతం గురించి ఆలోచిస్తూ ఆటలో మెరుగైన ప్రదర్శన చేడమే మా సిద్ధాంతం. ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి. ఆదివారం కూడా మాకు మరో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తామని శ్రేయాస్ అయ్యర్ పేర్కొన్నారు.
THE ISHAN KISHAN SHOW. pic.twitter.com/m3wBjM2AO5
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 25, 2026
