Shreyas Iyer : ఢిల్లీ ఇన్నింగ్స్ పూర్తి కాగానే.. మా ఆటగాళ్లకు ఒకే విషయం చెప్పా.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు..
ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించడం పట్ల పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆనందాన్నివ్యక్తం చేశాడు.
Shreyas Iyer key comments after Punjab Kings win against Delhi Capitals in IPL 2026 (pic credit@ipl)
- ఢిల్లీపై రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్
- ఆనందాన్ని వ్యక్తం చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
- కీలక వ్యాఖ్యలు
Shreyas Iyer : ఐపీఎల్ 2026 సీజన్లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ అదరగొడుతోంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఓటమే ఎరుగని జట్టుగా నిలిచింది. శనివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. దీనిపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఢిల్లీ ఎంత స్కోరు చేసినప్పటికి కూడా తాము ఒక్క పరుగు ఎక్కువ చేయాలని అనుకున్నట్లు తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (152 నాటౌట్; 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ శతకం బాదాడు. నితీష్ రాణా (91; 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, జేవియర్ బార్ట్లెట్ చెరో వికెట్ తీశారు.
ఆ తరువాత 265 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (76; 26 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (71 నాటౌట్; 36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలు చేశాడు. ప్రియాంష్ ఆర్య (43; 17 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్సర్లు) వేగంగా ఆడాడు.
వాళ్లు కొట్టంగా లేదని.. మేము కొట్టలేమా?
ఇక మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ గురించి చెప్పేందుకు తన వద్ద మాటలు లేవన్నాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. అదే సమయంలో బౌలర్లు ఫోర్లు, సిక్సర్లు ఇస్తుంటే సహనం కోల్పోతాము. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనేది అర్థం కాదు. అయితే.. పిచ్ ఎలా స్పందిస్తుందో తెలుసు అని అన్నాడు. వాస్తవం చెప్పాలంటే పిచ్ టర్న్ లభిస్తుందని తాము మొదట అనుకున్నామని, అయితే అలా జరగలేదన్నాడు.
పవర్లే తరువాత చాహల్ బౌలింగ్ చేసేటప్పుడు బంతి కాస్త ఆగుతూ వచ్చిందన్నాడు. అయితే.. అది పెద్దగా ప్రభావం చూపలేదన్నాడు. ఢిల్లీ బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు ఆడిన తీరు అద్భుతంగా ఉందన్నాడు. వాళ్లు ఎంత స్కోరు చేసినా సరే ఒక్క పరుగు ఎక్కువ సాధించి విజయం సాధించాలని తాను అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. బౌలర్లు ఎలాంటి బంతి వేసినా కానీ రాహుల్ చూడచక్కని షాట్లు కొట్టాడని, ఈజీగా పరుగులు రాబట్టాడని తెలిపాడు. వాళ్లే అంత ఈజీగా ఆడుతుంటే తాము కూడా చేయగలమని అనుకున్నట్లు శ్రేయస్ అయ్యర్ వివరించాడు.
ఇక లక్ష్య ఛేదనకు ముందు మా ప్లేయర్లకు ఒకటే చెప్పాను. గత మ్యాచ్‌లో కూడా తాము 220 నుంచి 225 పరుగుల లక్ష్యాన్ని రెండు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించామని, కాబట్టి అదే మైండ్ సెట్‌తో ఆడాలని సూచించినట్లుగా తెలిపాడు. పవర్ ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలని అనుకున్నామన్నాడు. ఇక తమ ఓపెనర్లు కూడా తొలి బంతి నుంచే దూకుడుగా ఆడుతూ మంచి ఆరంభాన్ని అందించారన్నాడు. ఆ జోరును తాము కూడా కొనసాగించాలని కోరుకున్నట్లుగా చెప్పాడు.
గత మూడు రోజులుగా ఎండలో చాలా కష్టపడి ప్రాక్టీస్ చేశామని, ఈ నేపథ్యంలో ఒక రోజు విశ్రాంతి తీసుకోవాలని తాము భావిస్తున్నట్లుగా చెప్పాడు. ఆ మరుసటి రోజు సరికొత్త ఉత్సాహంతో సమావేశం అవుతామన్నాడు. ఆ సమయంలో తాము ఆడబోయే తదుపరి మ్యాచ్ గురించి ప్రణాళికలను రచిస్తామన్నాడు.
