GT vs MI : అందువల్లే మేం ఓడిపోయాం.. లేదంటేనా.. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిపోవడంపై గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ కథ ముగిసింది. ఎలిమినేటర్‌లో ముంబై చేతిలో ఓడిపోయి ఇంటిముఖం పట్టింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఈ సీజన్‌ను ఆరంభించిన గిల్ సేన అనూహ్యంగా ముంబై చేతిలో ఓడిపోయింది. ఫీల్డింగ్‌లో వైఫల్యం వల్లే తాము ఓడిపోయినట్లు గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు సాధించింది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ (81; 50 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు), బెయిర్‌స్టో (47; 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిశోర్‌లు చెరో రెండు వికెట్లు తీయగా సిరాజ్ ఓ వికెట్ సాధించాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులకే పరిమితమైంది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ (80; 49 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (48; 24 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) విజయం కోసం గట్టిగానే పోరాడినా మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో ఫలితం లేకుండా పోయింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు పడగొట్టగా.. జస్‌ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్, మిచెల్ సాంట్నర్, అశ్వనీకుమార్ తలా ఓ వికెట్ తీశారు.
ముంబై చేతిలో ఓడిపోవడం పై గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు. ఫీల్డింగ్ వైఫల్యం కారణంగానే తాము ఓడిపోయామని చెప్పుకొచ్చాడు. తాము వదిలివేసిన మూడు క్యాచ్‌లు పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఏదీ ఏమైనప్పటికి ఈ సీజన్‌లో తాము మంచి ప్రదర్శననే చేసినట్లుగా తెలిపాడు.
‘ఇదో అద్భుతమైన మ్యాచ్. తృటిలో విజయం చేజారింది. లక్ష్య ఛేదనలో ఆఖరి మూడు, నాలుగు ఓవర్లు మాకు కలిసిరాలేదు. అయినప్పటికి మేం చాలా బాగా ఆడాం. మేము ఫీల్డింగ్‌లో మూడు క్యాచ్‌లు వదిలివేశాము. ఇలాంటి క్యాచ్‌లు వదిలివేస్తే బౌలర్లు పరుగులను నియంత్రించడం కష్టమే. ఇక సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్‌లు చాలా అద్భుతంగా ఆడారు. రెండో ఇన్నింగ్స్‌లో మంచు కారణంగా మాకు కొంచెం అడ్వాంటేజ్ లభించింది. అయితే.. ఈ వికెట్ పై 210 పరుగులే చాలా ఎక్కువ. కానీ అదనంగా మేం మరో 20 పరుగులు ఇచ్చాం.’ అని గిల్ తెలిపాడు.
ఇక ఈ టోర్నమెంట్‌లో ఆఖరి రెండు మూడు మ్యాచ్‌లు తమకు పెద్దగా కలిసి రాలేదన్నాడు. అయినప్పటికి ఆటగాళ్లు అంతా అద్భుతంగా ఆడారని చెప్పుకొచ్చాడు. ఈ టోర్నీలో ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయన్నాడు. ముఖ్యంగా సాయి సుదర్శన్ ఈ సీజన్‌లో ఎంతో కీలకంగా మారాడని తెలిపాడు.
PBKS vs RCB : సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడిని స్లెడ్జింగ్ చేసిన కోహ్లీ.. వీడియో వైరల్..