ఇంగ్లండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన గిల్.. రెండో టెస్టులో డబుల్ సెంచరీ

శుభ్‌మన్ గిల్ 311 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్స్‌లతో 200 పరుగులు చేశాడు.

ఇంగ్లండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన గిల్.. రెండో టెస్టులో డబుల్ సెంచరీ

Pic: @BCCI

Updated On : July 3, 2025 / 7:23 PM IST

ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ బాదాడు. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 87, కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, రవీంద్ర జడేజా 89, వాషింగ్టన్ సుందర్ 22 (నాటౌట్) పరుగులు చేయగా శుభ్‌మన్ గిల్ 200 పరుగులు బాది బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.

శుభ్‌మన్ గిల్ 311 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్స్‌లతో 200 పరుగులు చేశాడు. టెస్టులో అతడు చేసిన మొట్టమొదటి డబుల్ సెంచరీ ఇదే. ఇంగ్లాండ్‌లో అత్యధిక స్కోరు చేసిన భారత కెప్టెన్‌ కూడా అతడే.

అంతకుముందు శుభ్‌మన్‌ గిల్ 263 బంతుల్లో 150 రన్స్‌ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లాండ్‌లో 150, అంతకంటే ఎక్కువ రన్స్‌ చేసిన రెండో టీమ్‌ఇండియా కెప్టెన్‌గా గిల్ రికార్డు సృష్టించాడు.

SENA (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో శతకం చేసిన తొలి ఆసియా కెప్టెన్‌గానూ గిల్ ఘనత సాధించాడు. టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన ఆరో భారత కెప్టెన్‌ గిల్. ఇంతకుముందు కోహ్లీ, మన్సూర్ అలీ, గావస్కర్, సచిన్, ధోనీ ఒక్కో డబుల్ సెంచరీ చేశారు.

ఇక రవీంద్ర జడేజా 137 బంతుల్లో 10 ఫోర్లతో 89 పరుగులు చేశాడు. సెంచరీ చేస్తాడనుకుంటే ఔటై ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేశాడు. టీమిండియా స్కోరు 126 ఓవర్ల నాటికి 496/6గా ఉంది.

Viral Video: మ్యాచ్‌ జరుగుతోంటే.. గ్రౌండ్‌లోకి వచ్చిన పాము.. పరిగెత్తండ్రా బాబోయ్..