Sourav Ganguly: వారికంత సీన్ లేదు.. ఐపీఎల్ వాయిదాపై మాజీ కెప్టెన్ గంగూలీ కీలక కామెంట్స్ ..
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత తీవ్రంకావడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది..

Sourav Ganguly
Sourav Ganguly: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భారత సరిహద్దుల్లోని ప్రాంతాలపై పాకిస్థాన్ ఆర్మీ డ్రోన్ల దాడులకు పాల్పడుతుంది. అయితే, భారత్ సమర్ధవంతంగా పాక్ దాడులను తిప్పికొడుతుంది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత తీవ్రంకావడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్-2025 టోర్నీని వాయిదా వేసింది. అయితే, వారం రోజుల తరువాత మళ్లీ టోర్నీ నిర్వహిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బీసీసీఐ నిర్ణయంపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించారు.
గంగూలీ మాట్లాడుతూ.. ఐపీఎల్ టోర్నమెంట్ త్వరగానే పున:ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. “దేశంలో యుద్ధం లాంటి పరిస్థితి ఉంది. చాలా మంది స్వదేశీ, విదేశీ ప్లేయర్లు ఉన్నందున బీసీసీఐ వారి భద్రత, ప్రేక్షకుల భద్రతకోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఐపీఎల్ టోర్నీ కీలక దశలో ఉంది.. దీంతో ఈ టోర్నీ త్వరలో తిరిగి ప్రారంభమవుతుందని ఆశిద్దాం” అని సౌరవ్ గంగూలీ చెప్పారు.
ముఖ్యంగా ధర్మశాల, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్, జైపూర్ వంటి వేదికల్లో ఐపీఎల్ ఆడాల్సి ఉంది. ఇవన్నీ గురువారం రాత్రి పాకిస్థాన్ జరిపిన దాడులకు దగ్గరి ప్రాంతాలు. మరికొద్ది రోజుల్లో ఈ ఉద్రిక్తత వాతావరణం ముగుస్తుందని భావిస్తున్నా. త్వరలోనే మ్యాచ్ లు జరుగుతాయి. బీసీసీఐ ఐపీఎల్ ను పూర్తిచేస్తుంది. పాకిస్థాన్ ఎక్కువ కాలం ఒత్తిడిని తట్టుకోలేదు. కాబట్టి ఉద్రిక్తత పరిస్థితులు తొందరలోనే తొలగిపోతాయి. మళ్లీ మ్యాచ్ లు ప్రారంభమవుతాయని గంగూలీ అన్నారు.
గురువారం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ అర్ధంతరంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ మ్యాచ్ జరిగే ప్రాంతానికి కొద్దిదూరంలోనే మిసైళ్ల దాడికి ప్రయత్నించింది. అయితే, భారత్ ఆర్మీ పాక్ దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టింది. ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రత దృష్ట్యా మ్యాచ్ లను అర్ధంతరంగా నిలిపివేశారు. ఆటగాళ్లను సురక్షితంగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ ద్వారా ఢిల్లీకి తరలించారు.