SRH vs LSG : అయ్యో.. హైదరాబాద్.. లక్నో చేతిలో ఓటమి.. అదరగొట్టిన పూరన్, మార్ష్..!
SRH vs LSG : లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 5 వికెట్ల తేడాతో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

SRH vs LSG : Image Credit : @IPL (X)
SRH vs LSG : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి ఓటమిని చవిచూసింది. లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 5 వికెట్ల తేడాతో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో జట్టు ప్రారంభం నుంచే దూకుడుగా ఆడింది. పవర్ ప్లేలో ఐడెన్ మార్క్రామ్ వికెట్ కోల్పోయినప్పటికీ, 6 ఓవర్లలో 77 పరుగులు మాత్రమే చేశారు. నికోలస్ పూరన్ 26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో (70) విజృంభించాడు. మరో ప్లేయర్ మిచెల్ మార్ష్ 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో (52) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
నికోలస్ పూరన్ ఒకవైపు నుంచి విజృంభించగా.. ఓపెనర్ మిచెల్ మార్ష్ అప్పుడప్పుడు బౌండరీలు బాదాడు. 70 పరుగుల ఇన్నింగ్స్‌లో పురాన్ 6 సిక్సర్లు, 6 ఫోర్లు కొట్టాడు. ఇద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ లక్నో విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరి మధ్య రెండో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇద్దరి అద్భుతమైన ప్రదర్శనతో లక్నోను విజయతీరాలకు చేర్చారు.
ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ జట్టును సులభంగా లక్ష్యానికి తీసుకెళ్లారు. మిచెల్ మార్ష్ 31 బంతుల్లో 2 సిక్సర్లు, 7 ఫోర్లు బాదాడు. యువ ఆటగాడు అబ్దుల్ సమద్ తన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. 8 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 22 పరుగులు చేశాడు.
17వ ఓవర్లో, డేవిడ్ మిల్లర్ ఫోర్ కొట్టడం ద్వారా లక్నోకు విజయాన్ని అందించాడు. మిల్లర్ 13 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, అబ్దుల్ సమద్ 8 బంతుల్లో 22 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక, హైదరాబాద్ బౌలర్లలో కమిన్స్ (2), షమీ, జంపా, హర్షల్‌పటేల్ తలో వికెట్ పడగొట్టారు.
ముందుగా టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 28 బంతుల్లో 47 పరుగులు చేయగా, నితీశ్ రెడ్డి (32), క్లాసెన్ (26), అనికేత్ వర్మ 13 బంతుల్లో 36 పరుగులు చేశాడు.
శార్దూల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ :
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్‌కు పవర్ ప్లేలోనే శార్దూల్ ఠాకూర్ గట్టి షాకిచ్చాడు. మెగా వేలంలో అమ్ముడుపోని ఈ ఆల్‌రౌండర్ 4 వికెట్లు పడగొట్టాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ముఖ్యమైన వికెట్లు తీశాడు. శార్దూల్ ఠాకూర్ (4/34)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్దు దక్కింది.
అంతేకాదు.. అభినవ్ మనోహర్, మహ్మద్ షమీ వికెట్లు కూడా తీసుకున్నాడు. లక్నో బౌలర్ల దెబ్బకు హైదరాబాద్ నుంచి ఏ ఆటగాడూ 50 పరుగుల స్కోరును చేరుకోలేకపోయారు. రెండు మ్యాచ్‌ల్లో లక్నోకు ఇది తొలి విజయం కాగా, రెండు మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌కు ఇది తొలి ఓటమి.