సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్‌కు సాధ్యమేనా..

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్‌కు సాధ్యమేనా..

Updated On : April 26, 2019 / 11:26 AM IST

ఐపీఎల్ 2019 దాదాపు ప్లేఆఫ్ దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. టోర్నీలో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మినహాయించి అన్ని 11 మ్యాచ్‌లు ఆడేశాయి. గత సీజన్లో ఫైనల్ వరకూ వెళ్లిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది తడబడుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ ప్లేఆఫ్‌కు చేరుకుంటుందా అనే సందేహం అభిమానుల్లో మొదలైంది. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 గెలిచి 5 ఓటములకు బలైపోయింది. దీంతో 10 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంకా మిగిలి ఉన్న 4మ్యాచ్‌లు ఆడి.. అందులో కనీసం మూడింటిలో నెగ్గాలి.

ఒకవేళ రెండు గెలిస్తే మాత్రం.. ప్రత్యర్థి జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సిందే. వరల్డ్ కప్ సన్నాహాకాల్లో భాగంగా విదేశీ ప్లేయర్లు జట్టును వీడుతున్న వేళ రెండింటిలోనైనా గెలుస్తుందా.. అనే అనుమానాలు కనిపిస్తున్నాయి. సన్‌రైజర్స్ బౌలింగే ప్రధాన బలంగా గత సీజన్లో అద్భుతాలు సృష్టించారు. 140 లోపు స్వల్ప లక్ష్యాలను కూడా భద్రంగా కాపాడుకున్నారు. రషీద్‌ ఖాన్, షకీబ్‌ వంటి స్పిన్నర్లను, భువనేశ్వర్, సందీప్‌ శర్మ, సిద్ధార్థ్‌ కౌల్‌ వంటి పేసర్లను ఎదుర్కొనేందుకు ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మన్ సతమతమయ్యారు. కానీ, ఈ సీజన్లో బౌలర్లు అంతగా రాణించలేకపోవడం, విదేశీ ప్లేయర్లు దూరమవడం సమస్యగా మారింది. 

బ్యాటింగ్ ఆర్డర్‌పై స్పష్టంగా కనిపించే ప్రభావం మనీశ్‌ పాండే, విజయ్‌ శంకర్, యూసుఫ్‌ పఠాన్‌‌లపై తప్పక కనిపిస్తుంది. ఇదే వరుసలో ప్లే ఆఫ్‌కు వెళ్లాలంటే ఏప్రిల్ 27న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తప్పక గెలవాల్సిందే. లేదంటే ఏప్రిల్ 29న పంజాబ్‌తో మ్యాచ్‌లో పరిస్థితి చావోరేవో అన్నట్లు తయారవుతుంది. 
 
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడాల్సిన మిగతా మ్యాచ్‌లు:
రాజస్థాన్ రాయల్స్‌తో (ఏప్రిల్ 27),
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో (ఏప్రిల్ 29),
ముంబై ఇండియన్స్‌తో (మే 2),
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (మే 4)