Taiwan Open Athletics 2025: తిరుగులేని తెలుగు తేజం.. జ్యోతి ఎర్రాజీకి స్వర్ణ పతకం
100 మీటర్ల హర్డిల్స్‌లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించింది.

Taiwan Open Athletics 2025: తైవాన్ ఓపెన్ అథ్లెటిక్స్ లో భారత అథ్లెటిక్స్ సంచలనం, తెలుగు తేజం జ్యోతి ఎర్రాజీ మెరిసింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్ లో అద్భుతమైన ప్రదర్శనతో గోల్డ్ మెడల్ సాధించింది. చిరుతలా పరుగెత్తిన జ్యోతి 12.99 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. 100 మీటర్ల హర్డిల్స్ లో చిరుతలా దూసుకెళ్లింది. అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25ఏళ్ల జ్యోతి ఎర్రాజీ ఫైనల్లో 12.99 సెకన్లతో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో విజయం సాధించింది. జపాన్ అథ్లెట్లు అసుకా తెరడా (13.04 సెకన్లు), చిసాటో కియోయామ (13.10 సెకన్లు) వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచారు. జ్యోతి ఎర్రాజీకి గత 10 రోజుల్లో ఇది 2 గోల్డ్ మెడల్ కావడం విశేషం. ఆసియా ఛాంపియన్‌షిప్స్ లోనూ జ్యోతి సత్తా చాటింది. స్వర్ణం సాధించింది. 100 మీటర్ల హర్డిల్స్‌లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించింది.
Also Read: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
దక్షిణ కొరియా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో జ్యోతి ఎర్రాజీ స్వర్ణ పతకం గెలిచింది. మే 29 జరిగిన పోటీల్లో 12.96 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. అదే జోష్‌తో తైవాన్ ఓపెన్‌లోనూ సత్తా చాటిందీ తెలుగు తేజం. తైవాన్ ఓపెన్ ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ పోటీల్లో భారత్ మొత్తం ఆరు గోల్డ్ మెడల్స్ సాధించింది. పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో తేజస్ శిర్షే 13.52 సెకన్ల టైమింగ్‌తో గోల్డ్ సాధించాడు.
ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ కు చెందిన జ్యోతి.. భారత అథ్లెటిక్స్‌లో వేగంగా ఎదుగుతున్న యంగ్ అథ్లెట్. ఓ సామాన్య కుటుంబం నుండి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో భారత్ పేరు మారుమోగిస్తోంది. 2022లో అనురాధ బిస్వాల్ పేరిట ఉన్న జాతీయ రికార్డ్ ను బద్దలు కొట్టింది. 13.23 సెకన్లతో కొత్త రికార్డ్ నమోదు చేసింది. ఆ తర్వాత పలు సార్లు సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఆమె నేషనల్ రికార్డ్ 12.78 సెకన్లు.