Mohammed shami : ఆస్ట్రేలియా టూర్‌కు మహ్మద్ షమీ.. ఆ రెండు పరీక్షలు పాసైతేనే.. అవేమిటంటే.!
షమీ ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లాలంటే సెలక్షన్ కమిటీ పెట్టే రెండు పరీక్షల్లో పాస్ కావాల్సి ఉంది. అవేమిటంటే..

Mohammed shami
IND vs AUS Test Series : బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ పెర్త్ లో జరగనుంది. అయితే టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా ఫ్యాన్స్ ఎగిరిగంతేసే వార్త ఒకటి జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతుంది. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ త్వరలో ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న షమీ.. సంవత్సరం కాలంగా క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. తాజాగా అతను కోలుకోవటంతోపాటు మంచి ఫిట్ నెస్ సాధించాడు.
Also Read: IND vs AUS : ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్.. భారత్ జట్టుకు బిగ్‌షాక్..!
ఏడాది తరువాత మైదానంలోకి అడుగుపెట్టిన షమీ.. రంజీ ట్రోఫీలో బెంగాల్ తరపున మధ్యప్రదేశ్ మ్యాచ్ లో బరిలోకి దిగాడు. బుధవారం తొలిరోజు ఆటలో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన షమీ వికెట్లు ఏమీ పడగొట్టలేక పోయాడు. గురువారం రెండోరోజు ఆటలో విజృంభించాడు. తొమ్మిది ఓవర్లు వేసి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో తాను ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పకనే చెప్పాడు. దీంతో షమిని త్వరలో ఆస్ట్రేలియాకు పంపించాలని సెలక్షన్ కమిటీ భావిస్తోన్నట్లు తెలుస్తోంది.
Also Read: Virat Kohli : వాకా మైదానంలో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న కోహ్లీ, బుమ్రా.. వీడియో చూశారా?
షమీ ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లాలంటే సెలక్షన్ కమిటీ పెట్టే రెండు పరీక్షల్లో పాస్ కావాల్సి ఉంది. అవేమిటంటే.. రంజీ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ సమయంలో షమి ఫిట్‌నెస్ ఎలా ఉంది..? మ్యాచ్ ముగిసే సమయానికి గాయం అయిన ప్రాంతంలో వాపు, నొప్పి ఏమైనా ఉందా అనే విషయాలను ఎన్సీఏ వైద్య బృందం పరీక్షించనుంది. వైద్య బృందం గ్రీన్ సిగ్నల్ ఇస్తే షమీ ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. నవంబర్ 22 నుంచి బోర్డర్ గావస్కర్ ట్రోపీ సిరీస్ ప్రారంభం కానుంది. ఒకవేళ షమీ ఆస్ట్రేలియాకు వెళ్లినా మొదటి టెస్టుకు అందుబాటులో ఉండడు. రెండో టెస్టు నుంచి షమీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.