కివీస్ విలవిల : టీమిండియా టార్గెట్ 158

కివీస్ విలవిల : టీమిండియా టార్గెట్ 158

Updated On : January 23, 2019 / 4:54 AM IST

న్యూజిలాండ్ గడ్డపై ఆడిన తొలి వన్డేలో భారత బౌలర్లు సత్తా చాటారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు క్రీజులో కుదురుకునేందుకు అవకాశమివ్వకుండా 38 ఓవర్లలో 157 పరుగులకే కట్డడి చేశారు. భారత బౌలర్ల ధాటికి ఒక వైపు వరుసగా వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో క్రీజులో కుదురుకుంటూనే పరుగులు రాబట్టిన విలియమ్సన్‌ వికెట్‌ను సైతం 64 పరుగులకే కట్టడి చేశారు. ఓపెనర్లు విఫలమవడంతో ఆరంభమైన కాసేపటికే కివీస్ వికెట్ల కోత ఆరంభమైంది. షమీ 3, చాహల్ 2, కుల్దీప్ యాదవ్ 4, కేదర్ జాదవ్ 1వికెట్లు తీయగలిగారు. 

ఓపెనర్లు గప్తిల్‌, మన్రో ఇద్దరూ ఆరంభంలోనే తడబడ్డారు. ఈ రెండు వికెట్లూ ఫేసర్ షమీకే దక్కడం విశేషం. రెండో ఓవర్‌ ఐదో బంతికి గప్తిల్‌ (5) ఔటవగా.. నాలుగో ఓవర్‌ మూడో బంతికి మన్రో (8) వెనుదిరిగాడు. ఆ తర్వాత చాహల్‌ వేసిన 15వ ఓవర్లో రాస్‌ టేలర్‌ (24) అతనికే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్‌ విలియమ్‌సన్‌, టేలర్‌ మూడో వికెట్‌కు 34 పరుగులు జోడించారు. టేలర్ స్థానంలో బరిలోకి దిగిన లాథమ్ (11)పరుగులతో సరిపెట్టుకున్నాడు. ఈ వికెట్ కూడా చాహల్‌ క్యాచ్ & బౌల్డ్‌గా దక్కించుకోవడం విశేషం. 23 ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ ఐదో వికెట్‌ను చేజార్చుకుంది. కేదర్ జాదవ్ బౌలింగ్‌లో కుల్దీప్ క్యాచ్ అందుకోవడంతో నికోలస్(12)అవుట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మిచెల్ శాంతర్(14), బ్రాస్‌వెల్(7), ఫెర్గ్యూసన్(0), ట్రెంట్ బౌల్డ్(1)టిమ్ సౌథీ(9) నాటౌట్తో ముగించారు.

భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న ఈ రసవత్తర పోరులో టాస్‌ గెలిచిన కివీస్‌ కెప్టెన్‌ విలియమ్‌సన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే నేపియర్‌ వేదికగా మొదలైంది. ఆస్ట్రేలియాను దాని సొంతగడ్డపై ఇటు టెస్టుల్లో, అటు వన్డేల్లో మట్టికరిపించిన ఉత్సాహంలో భారత్‌ ఉండగా.. లంక పర్యటనను విజయవంతంగా ముగించుకున్న న్యూజిలాండ్ అదే నమ్మకంతో ఢీ కొట్టేందుకు సిద్ధమైంది.