RCB vs PBKS : ఆర్‌సీబీ ఇజ్జత్ కాపాడిన టిమ్ డేవిడ్.. తన బ్యాటింగ్ స్థానంపై సంచలన వ్యాఖ్యలు..
హాఫ్ సెంచరీతో రాయల్ ఛాలెంజర్స్ పరువు కాపాడిన టిమ్ డేవిడ్ పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మరో ఓటమి ఎదురైంది. ఈ సీజన్‌లో సొంత గడ్డపై ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది.
వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బ్యాటర్లలో టిమ్ డేవిడ్ (50 నాటౌట్; 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగిలిన వారిలో కెప్టెన్ రజత్ పాటిదార్ (23; 18 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించాడు. మిగిలిన వారు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. పంజాబ్ బౌలర్లో అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్, హర్‌ప్రీత్ బ్రార్ తలా రెండు వికెట్లు తీశారు. జేవియర్ బార్ట్‌లెట్ ఓ వికెట్ సాధించాడు.
IPL 2025: చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్షదీప్ సింగ్..
అనంతరం నేహాల్ వధేరా (33 నాటౌట్; 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 12.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ మూడు వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాయల్ ఛాలెంజర్స్ పరువు కాపాడిన టిమ్ డేవిడ్ పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడు ఆడకుంటే బెంగళూరు 60 పరుగుల లోపే ఆలౌటై మరో ఘోర పరాభవాన్ని మూటగట్టుకునేదని కామెంట్లు చేస్తున్నారు. కాగా.. తన ఇన్నింగ్స్ పై మ్యాచ్ అనంతరం టిమ్ డేవిడ్ స్పందించాడు.
ఈ పిచ్ పై బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదన్నాడు. తనకు ఏమి మాట్లాడాలో అర్థం కావడం లేదన్నాడు. పిచ్ ఎలా ప్రవర్తిస్తుందనేది ఔటైన బ్యాటర్లు తనకు చెప్పారన్నాడు. ప్రాక్టీస్ అప్పుడు కూడా ఇలాంటి పిచ్‌లే ఉన్నాయన్నాడు.
‘మా యాజమాన్యం, కోచింగ్ సిబ్బంది జట్టును ఒక నిర్దిష్ట కారణంతో నిర్మించారు. నేను నా బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తున్నాను. నేను ఎక్కడైతే స్కోరు చేయగలనని కోచ్‌లు నమ్ముతున్నారో అక్కడే ఆడిస్తున్నారు. ఒకవేళ టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాల్సి వస్తే.. అప్పుడు కూడా జట్టు కోసం వీలైనన్ని ఎక్కువ పరుగులు చేస్తాను. వర్షం రావడం వల్ల కవర్ల కింద పిచ్ ఉండడంతో అది స్పందించే విధానం మారిపోయింది. మేము మా హోంగ్రౌండ్‌లో చక్కటి ప్రదర్శన చేయలేకపోతున్నాము. ఇక్కడ గెలిచేందుకు మేము ఓ మార్గాన్ని కనుగొనాల్సి ఉంది. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తదుపరి మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తాం.’ అని టిమ్ డేవిడ్ అన్నాడు.