Under 19 Women’s T20 World Cup : మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ప్లేయర్లు ఎవరో తెలుసా? భారత్ నుంచి ఎంత మంది అంటే?
మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జరిగిన అండర్ -19 మహిళల టీ20 ప్రపంచకప్ 2025లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ ఎవరో ఓ సారి చూద్దాం.

Top five run scorers in Under 19 Womens T20 World Cup 2025
మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న అండర్ -19 మహిళల టీ20 ప్రపంచకప్ ముగిసింది. భారత్ వరుసగా రెండో సారి ఈ మెగా టోర్నీ విజేతగా నిలిచింది. ఆదివారం దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో గొంగడి త్రిష మూడు, వైష్ణవి శర్మ, ఆయుషి శుక్లా, పరుణిక తలా రెండు, షబ్నమ్ ఓ వికెట్ తీసింది.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ 11.2 ఓవర్లలో వికెట్ నష్టపోయి ఛేదించింది. కమలిని (8) విఫలమైనా గొంగడి త్రిష (33 బంతుల్లో 44 నాటౌట్), సానికా చాల్కే(22 బంతుల్లో 26 నాటౌట్) లు రాణించారు. ఫైనల్ తో పాటు టోర్నీ అసాంతం నిలకడగా రాణించిన గొంగడి త్రిషకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.
ఇదిలా ఉంటే.. ఈ మెగాటోర్నీలో పరుగులు వరద పారించిన టాప్-5 బ్యాటర్లు ఎవరో ఓ సారి చూద్దాం.
గొంగడి త్రిష..
మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025 టోర్నీలో భారత ఓపెనర్ గొంగడి త్రిష టాప్ స్కోరర్‌గా నిలిచింది. భీకర ఫామ్‌లో ఉన్న త్రిష ఏడు ఇన్నింగ్స్‌ల్లో 76.25 సగటుతో 147.34 సగటుతో 305 పరుగులు చేసింది. ఇందులో ఓ సెంచరీ చేసింది. స్కాట్లాండ్ పై 110 పరుగులతో అజేయంగా నిలిచింది. ఈ క్రమంలో అండర్ -19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. 2023 ఎడిషన్‌లో ఐర్లాండ్‌పై ఇంగ్లాండ్‌కు చెందిన గ్రేస్ స్క్రివెన్స్ 93 పరుగులు చేయడంతో గతంలో అత్యధిక స్కోరుగా ఉంది.
డేవినా పెర్రిన్..
ఇంగ్లాండ్‌కు చెందిన డేవినా పెర్రిన్ ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచింది. ఐదు ఇన్నింగ్స్‌లలో 35.20 సగటుతో 176 పరుగులు చేసింది. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. ఈ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కింది. ఈ ఎడిషన్‌లో డేవినా పెర్రిన్ ఏడు సిక్సర్లు కొట్టింది.
జి కమలిని..
భారత మరో ఓపెనర్ జి కమలిని ఈ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన మూడో ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కింది. మొత్తం 7 ఇన్నింగ్స్‌లలో 35.75 సగటుతో 143 పరుగులు చేసింది. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
కావోయిమ్‌హే బ్రే..
ఆస్ట్రేలియా ప్లేయర్ కావోయిమ్‌హే బ్రే 5 ఇన్నింగ్స్‌లలో 29.75 సగటుతో 119 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. టోర్నమెంట్‌లో ఆమె అత్యధిక స్కోరు 45. అంతేకాదండోయ్ 100 కంటే తక్కువ స్ట్రైక్ రేట్ (96.74)తో జాబితాలో ఉన్న ఏకైక బ్యాటర్ ఆమె.
జెమ్మా బోథా..
దక్షిణాఫ్రికా ఓపెనర్ జెమ్మా బోథా 6 ఇన్నింగ్స్‌లలో 26.25 సగటుతో 123.52 స్ట్రైక్ రేట్‌తో 105 పరుగులు చేసింది. అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. బోథా అత్యధిక స్కోరు 37.