Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత స్మిత్ బాటలో రోహిత్, కోహ్లీ..?
ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తరువాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ బాటలో పయణిస్తారని..

Rohit Sharma and Virat Kohli
Rohit, Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు భారత్ జట్టు సన్నద్ధమవుతుంది. ఈనెల 9న న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. అయితే, ప్రస్తుతం ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తరువాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలు వన్డేల నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్ బాటలో వారిద్దరూ పయణిస్తారని చర్చ జరుగుతుంది.
Also Read: Mohammed Shami: టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీపై విమర్శలు.. మహాపాపి, నేరగాడు అంటూ..
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆయా జట్లు నిష్ర్కమించిన వెంటనే పలువురు క్రికెటర్లు వన్డేలకు వీడ్కోలు ప్రకటిస్తున్నారు. వీరిలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, బంగ్లాదేశ్ వికెట్ కీపర్, బ్యాటర్ ముష్పికర్ రహీంలు ఉన్నారు. ఈ క్రమంలో టీమిండియా నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా వన్డేలకు వీడ్కోలు చెబుతారని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం వన్డేలకు గుడ్ బై చెబుతారని కొద్దికాలంగా ప్రచారం జరుగుతుంది. ఫైనల్ తరువాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
2024 టీ20 ప్రపంచ కప్ లో భారత్ జట్టు విజేతగా నిలిచిన తరువాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20లకు వీడ్కోలు పలికారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత వారు వన్డేలకు వీడ్కోలు చెప్పే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఇటీవల తన యూట్యూబ్ వీడియోలో ప్రస్తావించారు. ‘‘వన్డేల నుంచి వైదొలగాలనే విషయం పూర్తిగా వారి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. నిజాయితీగా చెప్పాలంటే అది అంత సులభం కాదు. 2025లో కోహ్లీ బ్యాటింగ్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. రోహిత్ ప్రదర్శన కూడా బాగుంది. అయితే, రోహిత్ ప్రదర్శన చాలా బాగుందని నేను చెప్పను. ఫైనల్ లో సెంచరీ చేయడం ద్వారా అతను తన సత్తాను మరోసారి నిరూపించుకోవచ్చు’ అంటూ చోప్రా అన్నారు.