Virat Kohli : ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్.. అతడిని అలా చూడడం ఎంతో బాధగా ఉందన్న కోహ్లీ.. కుర్రాళ్ల చేతిలో మరో 10 ఏళ్లు..
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన తరువాత టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

Virat kohli comments after winning ICC Champions Trophy 2025 final match
టీమ్ఇండియా ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టీమ్ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే.. ఓ ఆటగాడిని చూస్తుంటే తనకు ఎంతో బాధగా ఉందన్నాడు.
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలవడం అద్భుతంగా ఉందన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన చేదు అనుభవాన్ని మిగల్చడంతో తాము తిరిగి బలంగా పుంజుకోవాలని భావించినట్లు చెప్పాడు. ఏదైన పెద్ద టోర్నీ గెలవాలని కోరుకున్నామని, చివరికి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ2025ని గెలవడం ఉత్సాహాన్ని ఇచ్చిందన్నాడు. ఇది అద్భుతమైన అనుభూతి అని చెప్పుకొచ్చాడు.
‘కుర్రాళ్లతో ఆడడం చాలా బాగుంది. వీరిలో అద్భుతమైన టాలెంట్ ఉంది. భారత క్రికెట్‌ను వారు సరైన దిశలో ముందుకు తీసుకువెలుతున్నారు. సీనియర్లుగా వారికి మార్గనిర్దేశనం చేస్తున్నాము. ప్రస్తుతం జట్టు ఎంతో బలంగా ఉంది. గతంలో కొన్ని సార్లు టైటిల్స్‌ను మిస్ అయ్యాం. అయితే.. ఈ టోర్నీలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో జట్టును ఆదుకున్నారు. అందరూ సమిష్టిగా రాణించడంతో ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్నాం. అని కోహ్లీ అన్నాడు.
గిల్ చెప్పినట్లుగా.. నేను ఈ కుర్రాళ్లతో వీలైనంత ఎక్కువగా మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. నేను ఇంతకాలం ఎలా ఆడగలిగాను అనే దాని గురించి నా అనుభవాన్ని పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. నాకు సాధ్యమైనంత మేర వారి ఆటను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాను. రాబోయే 8 నుంచి 10 ఏళ్ల పాటు భారత్‌కు డోకా లేదు. అప్పటి వరకు రాణించే సత్తా ఉన్న ఆటగాళ్లు దొరికేశారు. అని కోహ్లీ తెలిపాడు.
ప్రత్యర్థి జట్టు కివీస్ గురించి మాట్లాడుతూ.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో న్యూజిలాండ్ ఎంత ప్రమాదకరమైన జట్టులో అందరికి తెలిసిందే. వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో నాణ్యమైన ఆటతీరును ప్రదర్శిస్తున్నారు. వారితో ఆడిన ప్రతి సారి మాకు ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ప్రతి ప్రణాళికను వారి ఎంతో ఖచ్చితంగా మైదానంలో అమలు చేస్తారు. నాకు తెలిసి ఆ జట్టు అంత ఖచ్చితంగా ప్రణాళిలను మైదానంలో అమలు చేసే టీమ్ మరొకటి లేదు.
ఆ జట్టులో ప్రతి ఫీల్డర్ కూడా వారి బౌలర్ ఎక్కడ బంతులను వేయబోతున్నాడో స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఖచ్చితంగా న్యూజిలాండ్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. గత కొన్నాళ్లుగా పెద్ద టోర్నమెంట్లలో అత్యంత స్థిరంగా ఆ జట్టు రాణిస్తూ వస్తోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డింగ్ జట్టు న్యూజిలాండ్ అని కోహ్లీ కొనియాడాడు.
ఇక కివీస్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ తనకు మంచి స్నేహితుడు అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే.. అతడిని ఓడిన జట్టులో చూడడం చాలా బాధగా ఉందన్నాడు. అయితే.. అతడు గెలిచిన జట్టులో ఉన్న రెండు సందర్భంలో తాను ఓడిన జట్టులో ఉన్నానని చెప్పి కోహ్లీ అందరిని నవ్వుల్లో ముంచాడు. ఇక వన్డే క్రికెట్‌లో రిటైర్‌మెంట్ గురించి మాట్లాడుతూ.. తనకు ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచన లేదన్నాడు.