Sunil Gavaskar : భారత జట్టు విజేతగా నిలవగానే.. దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఏం చేశాడో చూశారా? వీడియో వైరల్
భారత జట్టు ఛాంపియన్స్ విజేతగా నిలవగానే టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ చేసిన పని ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Sunil Gavaskar goes out of control brings out child like dance moves after India win Champions Trophy 2025
ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. దీంతో ముచ్చటగా మూడోసారి ఈ కప్పును కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీని అత్యధిక సార్లు గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది వరుసగా రెండో ఐసీసీ టైటిల్ కావడం గమనార్హం. గతేడాది రోహిత్ నాయకత్వంలో భారత జట్టు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
కాగా.. టీమ్ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంటున్న సమయంలో దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీలో సునీల్ గవాస్కర్ ఇంగ్లీష్ కామెంటరీ ప్యానల్‌లో సభ్యుడుగా ఉన్నాడు.
SUNIL GAVASKAR DANCING WHEN INDIA WON THE CHAMPIONS TROPHY 🥹 pic.twitter.com/yeFeS2J0Bw
— Johns. (@CricCrazyJohns) March 9, 2025
మ్యాచ్ అనంతరం తన బాధ్యతల నుంచి కాస్త విరామం తీసుకున్న తరువాత.. భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ అందుకుని.. ఛాంపియన్స్ బోర్డు వద్ద ఫోటోలకు ఫోజులు ఇస్తున్న సమయంలో సునీల్ గవాస్కర్ ఆనందంతో కేరింతలు కొట్టాడు. చిన్న పిల్లాడిలా డ్యాన్స్ చేశాడు.
ఈ వీడియో వైరల్‌గా మారగా.. నెటిజన్ల హృదయాలను అతడు గెలుచుకున్నాడు. కాగా.. టీమ్ఇండియా మొట్టమొదటిసారిగా గెలుచుకున్న వన్డే ప్రపంచకప్ (1983లో) లో గవాస్కర్ సభ్యుడు కావడం విశేషం.
ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ (63; 101 బంతుల్లో 3 ఫోర్లు), బ్రాస్‌వెల్ (53 నాటౌట్; 40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లు అర్థశతకాలు సాధించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు, రవీంద్ర జడేజా, షమీలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ (76; 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో కదం తొక్కగా శ్రేయస్ అయ్యర్ (48; 62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (34 నాటౌట్; 33 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) లు రాణించడంతో లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి అందుకుంది. రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక అయ్యాడు.