కెప్టెన్ కే జలక్: ప్రపంచ కప్‌లో కోహ్లీ ప్లేస్ మారుస్తాం

ప్రపంచ కప్‌కు సన్నద్ధమవ్వాలనే ఉద్దేశ్యంతో కొన్ని నెలల ముందే టీమిండియా విదేశీ పర్యటన మొదలుపెట్టేసింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలను పూర్తి చేసుకున్న భారత్.. న్యూజిలాండ్ గడ్డపైన కూడా సత్తా చాటుతోంది. జట్టు కూర్పులో చాన్నాళ్లుగా తర్జనభర్జనలు పడుతున్న టీమిండియా ఈ పాటికే ఓ నిర్ణయానికి వచ్చేసింది. మిడిల్ ఆర్డర్ సమస్యను అటుంచి మూడు, నాలుగు స్థానాల గురించి యోచిస్తోంది. ఈ క్రమంలో ఒకవేళ అవసరమైతే నాలుగో స్థానంటో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని బ్యాటింగ్ దించాలని అనుకుంటున్నట్లు భారత జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు.
న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి టీ20కి ముందు మీడియా సమావేశంలో మాట్లాడిన రవిశాస్త్రి ఇలా పేర్కొన్నాడు. ‘ప్రపంచ కప్ ఆడేందుకు సిద్ధమవుతున్నాం. ఓపెనర్లుగా రాణిస్తున్న ధావన్, రోహిత్‌ల జోడీని విడగొట్టాలని అనుకోవట్లేదు. పరిస్థితులను బట్టి కోహ్లీని నాలుగో స్థానంలో దించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపాడు.
కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగితే మరి మూడో స్థానంలో బ్యాటింగ్‌కు ఎవరు వస్తారని అడిగిన ప్రశ్నకు అంబటి రాయుడు లేదా ఇంకెవరనైనా పరిశీలిస్తామంటూ చెప్పుకొచ్చాడు. దాంతో పాటు ఓపెనింగ్ జోడీ అయిన రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లను కొనియాడాడు. ‘ధావన్ ఇటీవలే 5వేల వన్డే పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక రోహిత్ విషయానికొస్తే రోహిత్ శర్మ మూడు డబుల్ వన్డే సెంచరీలు చేసిన రికార్డు ఉంది. వాళ్లను చూస్తుంటే భారత బెస్ట్ ఓపెనింగ్ జోడి సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలే గుర్తొస్తారని ప్రశంసించాడు.